
తాడేపల్లి,సాక్షి: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరంలో కిమ్స్ బొల్లినేని ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను కోరారు.
అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. విద్యార్థిని విషయంలో కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో విద్యార్థిని తల్లిదండ్రులు అనంత లక్ష్మి, దుర్గారావుతో పాటు, వైఎస్సార్‌సీపీ నేతలు మార్గాని భరత్, వరుదు కళ్యాణి, ఆరె శ్యామల ఉన్నారు.
