
సాక్షి, గుంటూరు: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని.. ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావంతో ఆయన్ను ముంబైకి తీసుకువెళ్లారని అంబటి వివరించారు.
‘‘కొడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించాం. ఇవాళో, రేపో నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారు. ఆయన సంతోషంగా ఇంటికి వస్తారు.. అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
‘‘జైల్లో ఉన్న వంశీ జుట్టుకు రంగు వేయటం మానేశారు. దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు, కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులు కాదు. వాళ్లిద్దరూ క్షేమంగా వస్తారు.. టీడీపీని ఎదురిస్తారు. వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నాయి.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
