
మహిళలు, చిన్నారులకు హెల్త్‌కేర్ సర్వీసులు అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంకురా ఆసుపత్రికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.165 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ఆసుపత్రి కార్యకలాపాలను విస్తరించేందుకు ఖర్చు చేయబోతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ సేవలను విస్తరించడానికి, దేశం అంతటా ఆరోగ్య సంరక్షణను పెంపొందించేందుకు ఏడీబీ నిధులు తోడ్పడుతాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఉన్నం మాట్లాడుతూ..‘ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి సమకూరిన ఈ నిధులు భారతదేశంలో మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న సంస్థ నిబద్ధతకు నిదర్శనం. ఈ నిధులు పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ సేవలను పెంచడానికి, ఆసుపత్రి సౌకర్యాలను విస్తరించడానికి, మరిన్ని కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఎంతో దోహదం చేస్తాయి’ అని తెలిపారు. విస్తరణ వ్యూహంలో భాగంగా అంకుర హాస్పిటల్స్ దేశం అంతటా ప్రధాన నగరాల్లో కొత్త అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 15 హెల్త్‌కేర్ సెంటర్ల నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యం యోచిస్తోంది. అందులో భాగంగా పడకల సామర్థ్యాన్ని పెంచడం, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అదనపు ప్రత్యేక సిబ్బందిని నియమించడంపై దృష్టి పెడుతుంది.