
ముస్లింలకు పర్వదినమైన రంజాన్ మార్చి 31న వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే బ్యాంకులకు మాత్రం ఆరోజు సెలవు లేదు. ఎందుకంటే ఆరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో మార్చి 31న బ్యాంకులు క్లియరింగ్ ఆపరేషన్‌లో పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను సులభతరం చేస్తుంది. పండుగలు, వారాంతపు సెలవులతో సంబంధం లేకుండా దేశం అంతటా ఆదాయపు పన్ను, సీజీఎస్టీ కార్యాలయాలు మార్చి 29 నుండి మార్చి 31 వరకు తెరిచి ఉంటాయి.
భారతదేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాలని ఆర్బీఐ గతంలో పేర్కొంది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు, శాఖలు మార్చి 31న సాధారణ పని గంటలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీల కోసం తెరిచి ఉండాలని అపెక్స్ బ్యాంక్ కోరింది.
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్టాండర్డ్ క్లియరింగ్ టైమింగ్స్ మార్చి 31న వర్తిస్తాయని ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను మార్చి 31 నాటికి లెక్కించడానికి వీలుగా మార్చి 31న ప్రభుత్వ చెక్కుల కోసం ప్రత్యేకంగా సీటీఎస్ కింద ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. అన్ని బ్యాంకులు ఈ ప్రత్యేక క్లియరింగ్ ఆపరేషన్లలో పాల్గొనాలని సర్క్యులర్‌లో ఆదేశించింది.