
ఐఈడబ్ల్యూ సదస్సులో పెట్టుబడిదారులకు ప్రధాని ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత ఇంధన రంగం(Energy Sector)లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. వచ్చే అయిదేళ్లలో భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధనానికి మారాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2025లో (ఐఈడబ్ల్యూ 25) వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను సాధించాలన్న లక్ష్యాలు, చమురు .. గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు బిడ్డింగ్ ప్రకటించడం మొదలైనవి దేశీయంగా ఇంధన రంగానికి దన్నుగా నిలుస్తాయని ఆయన చెప్పారు.
వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, కొత్త ఆవిష్కరణలను రూపొందించేలా ప్రతిభావంతులను ప్రోత్సహించడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోందని తెలిపారు. ఆర్థికంగాను, రాజకీయంగానూ దేశం పటిష్టంగా ఉందని ప్రధాని వివరించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాబోయే రెండు దశాబ్దాలు చాలా కీలకమని, వచ్చే అయిదేళ్లలో దేశం అనేక మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి దేశం అయిదో స్థానానికి చేరిందని చెప్పారు.
ఈఈఎస్‌ఎల్ ఒప్పందాలు..
ఐఈడబ్ల్యూ సందర్భంగా ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) తమ 15వ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలతో రూ. 500 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండొనేషియా–మలేషియా–థాయ్‌ల్యాండ్ గ్రోత్ ట్రయాంగిల్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (ఐఎంటీ–జీటీ జేబీసీ), గ్రీన్ గ్రోత్ ఏషియా ఫౌండేషన్ (జీజీఏఎఫ్), ఐఐటీ హైదరాబాద్ వీటిలో ఉన్నాయి. విద్యుత్ ఆదా చేసే లైటింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కూలింగ్ సాంకేతికతలు మొదలైన వాటి రూపకల్పనకు ఎంవోయూలు తోడ్పడనున్నాయి.