
ట్రాఫిక్ జరిమానాల రికవరీని వేగవంతంగా చేయడానికి.. కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ట్రాఫిక్ ఈ-చలానాలు చెల్లించని వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
వాహనదారులు లేదా వాహన యజమానులు తన చలానాలను మూడు నెలల లోపల చెల్లించాలి. లేకుంటే.. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఒక ఆర్ధిక సంవత్సరంలో.. సిగ్నెల్ జంప్ చేయడం లేదా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మూడు సార్లు చలానాలకు గురైతే.. వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.
వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు కూడా ట్రాఫిక్ ఈ-చలానాలతో అనుసంధానం చేయాలని ముసాయిదా నిబంధనలో వెల్లడించారు. కాబట్టి డ్రైవర్ ఒక ఆర్ధిక సంవత్సరంలో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ చలానాలు చెల్లించకుండా తప్పించుకుంటూంటే.. వారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలు
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ఒకటిగా ఉంది. మన దేశంలో సుమారు 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 1,80,000 మంది మరణించగా.. 4,00,000 మంది తీవ్రంగా గాయపడ్డారని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మరణాలలో 1,40,000 మంది 18 నుంచి 45 ఏళ్ల వయసున్నవారే అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. జాతీయ రహదారులను విస్తరించడం, ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేయడం వంటి వాటితో పాటు భారీ జరిమానాలు విధించడం వంటివి చేస్తోంది. ట్రాఫిక్ రూల్ అతిక్రమించి చలానాలు కట్టకుండా తప్పించుకునే వారిని కూడా వదిలిపెట్టకూడదనే ఉద్దేశ్యంతో.. కేంద్రం ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో ట్రాఫిక్ చలాన్ల రికవరీ రేటు కేవలం 14 శాతం మాత్రమే. ఇది కర్ణాటకలో 21 శాతం, తమిళనాడు & ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 27 శాతంతో ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానాలో ట్రాఫిక్ చలాన్ రికవరీ రేట్లు వరుసగా 62, 76 శాతంగా ఉన్నాయి.