
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు అమలయ్యేలా తప్పనిసరి నియమావళిని రోడ్డు రవాణా– రహదారుల శాఖ జారీ చేసింది. మోటారు వాహనాల (సవరణ) చట్టం –2019లోని సెక్షన్ 8 ద్వారా దఖలు పడిన అధికారంతో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు నియమ నిబంధనలను తయారు చేసి జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.
కేంద్రం జారీ చేసిన కొత్త నియమావళి ప్రకారం అభ్యర్థులకు అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు ఆయా కేంద్రాల్లో సిమ్యులేటర్లు, డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు డ్రైవింగ్ లైసెన్స్‌కు దాఖలు చేసుకున్న సమయంలో ప్రస్తుతం ప్రాంతీయ రవాణా కార్యాలయా(ఆరీ్టవో)ల్లో నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ శిక్షణ కేంద్రాల గుర్తింపును ఐదేళ్ల కాలానికి గాను జారీ చేస్తారు. తర్వాత రెన్యూవల్ చేయవచ్చు.