
దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ టూవీలర్ విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ లో చేసిన ఈ ప్రకటనను ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని అతిపెద్ద సంస్థ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణంగా సమర్థించింది.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశాలను కీలకమైన, దీర్ఘకాలిక చర్యగా భావిస్తున్నారు. ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని ఎప్పటి నుంచో వాదిస్తున్న హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మంత్రి క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించింది. 'ఇది కేవలం రెగ్యులేషన్ మాత్రమే కాదు. ఇది జాతీయ అవసరం. ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించగలదనే ఆశను కలిగిస్తుంది" అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు.
హెల్మెట్ లేకపోవడం వల్లే..
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు భారతదేశ రహదారి భద్రత భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 66 శాతం ప్రమాదాలలో బాధితులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే. ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తుండగా వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని పరిశ్రమ నొక్కి చెప్పింది.