
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ కంపెనీల జాబితాలో టీవీఎస్ చెప్పుకోదగ్గ బ్రాండ్. ఈ సంస్థ మార్కెట్లో లాంచ్ చేసిన అపాచీ బైక్ ఇప్పటికి 60 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించి అరుదైన ఘనత సాధించింది.
2005లో 'అపాచీ 150' పేరుతో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్.. ఆ తరువాత అనేక వేరియంట్ల రూపంలో అందుబాటులోకి వచ్చింది. కాగా 2025 నాటికి అపాచీ సేల్స్ 60 లక్షలు దాటింది. అంటే 20 ఏళ్లలో ఈ అమ్మకాలను సాధించింది. ఈ బైక్ భారతీయ విఫణిలో మాత్రమే కాకుండా.. 60కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.
నేపాల్, బంగ్లాదేశ్, కొలంబియా, మెక్సికో, గినియా వంటి ఆఫ్రికా ప్రాంతాలు వ్యాపించిన అపాచీ ఉనికి.. ఇటీవలి సంవత్సరాలలో ఇటలీతో సహా యూరప్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. దీన్నిబట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
2005 నుంచి టీవీఎస్ మోటార్ కంపెనీ తన అపాచీ బైకుల్లో అనేక మార్పులు తీసుకువస్తూనే ఉంది. ఇందులో భాగంగానే లేటెస్ట్ అపాచీ బైకులలో ఫ్యూయెల్ ఇంజెక్షన్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, అడ్జస్టబుల్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ ప్రవేశపెట్టింది.