
న్యూయార్క్: ఒకవైపు ప్రత్యర్ధి కంపెనీల నుంచి పోటీ, మరోవైపు స్వయంగా సీఈవో ఎలాన్ మస్క్ బాహాటంగా రాజకీయాల్లో మునిగి తేలుతుండటం తదితర పరిణామాలు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో కంపెనీ విఫలమవుతోంది.
ఫలితంగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో టెస్లా కార్ల విక్రయాలు రెండంకెల స్థాయిలో 13 శాతం పడిపోయాయి. గతేడాది మార్చి క్వార్టర్‌లో 3,87,000 వాహనాలు విక్రయించగా, ఈసారి మార్చి క్వార్టర్‌లో ఈ సంఖ్య 3,36,681 యూనిట్లకు పడిపోయింది. భారీగా డిస్కౌంట్లు, ఇతరత్రా ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది.
వాస్తవానికి విక్రయాల సంఖ్య 4,08,000 యూనిట్లుగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. అమెరికా, చైనాతో పాటు యూరప్‌లోనూ టెస్లా కార్లకు డిమాండ్ నెమ్మదించిందని, బ్రాండ్ ప్రతిష్ట మసకబారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జనవరి– మార్చి త్రైమాసిక ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే ఘోరంగా ఉండొచ్చని చెప్పారు.