SBI Small Cap Fund Review - Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్‌ ఫండ్‌ గురించి మీకు తెలుసా?

Published Mon, Aug 7 2023 8:07 AM | Last Updated on Mon, Aug 7 2023 8:51 AM

Sbi Small Cap Fund Review - Sakshi

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇటీవలి కాలంలో మంచి ర్యాలీ చేయడాన్ని చూశాం. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ అనుకూలంగా ఉంటాయి.

ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే.. మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం వరకు మిడ్, స్మాల్‌క్యాప్‌ విభాగాలకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా ఒకటి. కనుక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇది స్మాల్‌క్యాప్‌ పథకమే అయినా మిడ్, స్మాల్‌క్యాప్‌నకు సమ ప్రాధాన్యం ఇస్తోంది. 

పనితీరు 
ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం పనితీరుకు బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్‌ టీఆర్‌ఐ రాబడి ప్రామాణికం. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్‌ సూచీతో పోలిస్తే ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ కొన్ని కాలాల్లో మెరుగైన పనితీరు చూపించింది. ముఖ్యంగా ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్‌ కంటే ఈ పథకమే అధిక రాబడులు అందించింది. ఐదేళ్లలోపు చూస్తే ప్రామాణిక సూచీ కంటే వెనుకబడింది. ఈ పథకంలో అధిక శాతం పెట్టుబడులు మిడ్‌క్యాప్‌లో ఉన్నందున ప్రామాణిక సూచితో పోల్చుకోవడం అంత అర్థవంతంగా ఉండదు.

కనీసం ఏడేళ్లు అంతకుమించిన దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకంలో నికరంగా 20 రాబడిని ఇచ్చింది. కానీ, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇదే కాలంలో 29 శాతం పెరిగింది. ఇక మూడేళ్ల కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌ క్యాప్‌ పథకం వార్షికంగా 36 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 18.87 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఏడేళ్లలో ఈ పథకంలో రాబడి  21 శాతం, పదేళ్లలో 27 శాతం చొప్పున ఉంది. కానీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 250 సూచీ రాబడి ఐదేళ్లలో 14.59 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 19 శాతం చొప్పునే ఉంది. ఇక ఈ పథకం ఆరంభమైన 2009 సెప్టెంబర్‌ నుంచి చూస్తే ఏటా 20 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. 

పెట్టుబడుల విధానం 
2011, 2013, 2018, 2020 మార్కెట్‌ కరెక్షన్లలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం నష్టాలను తగ్గించే విధంగా పనిచేసింది. అంతేకాదు 2014, 2017, 2020–21 బుల్‌ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు ఎక్కువ కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,625 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోని గమనించినట్టయితే 94 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది.

ఇది పేరుకు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అయినప్పటికీ స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు 38.57 శాతంగానే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 60 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులు ఒక శాతం కంటే తక్కువే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 54 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 16.38 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్‌ డిస్క్రీషనరీ రంగానికి 13.59 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలకు 13.30 శాతం, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు 7.88 శాతం, మెటల్స్, మైనింగ్‌ కంపెనీలకు 7.86 శాతం, కెమికల్స్‌ కంపెనీలకు 6.97 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement