
297 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) నుంచి 297 బస్సుల సరఫరా, నిర్వహణకు భారీ ఆర్డరు లభించింది. కాంట్రాక్ట్ ప్రకారం లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌వోఏ) తేదీ నుంచి 11 నెలల్లో బస్సులను అందించాల్సి ఉంటుంది.
ఈ డీల్ విలువ సుమారు రూ. 424.01 కోట్లని కంపెనీ వివరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందిన ఈ బస్సులు 30 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.
ఒక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఇన్ని విద్యుత్ బస్సులను నేరుగా కొనుగోలు చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్ చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద ఆర్డరును అందుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు.
