
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఉద్యోగ మార్కెట్ బలంగా నిలబడిందని.. పలు రంగాల్లో నియామకాలు మెరుగ్గా సాగాయని మైఖేల్ పేజ్ ఇండియా (అంతర్జాతీయ నియామకాల సంస్థ) ఎండీ నిలయ్ ఖండేల్‌వాల్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యాల్లో లోతైన అనుభవం, వ్యయ నియంత్రణలు, సిబ్బంది కొత్త నైపుణ్యాలను వేగంగా అలవరుచుకోవడాన్ని భారత్ బలాలుగా పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి మందగమనంతో అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొనగా.. భారత్‌లో మాత్రం నిపుణులకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. స్టెమ్ విభాగంలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఆధిపత్యంతో భారత్ నైపుణ్య కేంద్రంగా కొనసాగుతోందని.. పోటీతో కూడిన వేతనాలు, ప్రభుత్వ మద్దతుతో నైపుణ్యాల కల్పన, అంతర్జాతీయ క్యాపబులిటీ కేంద్రాల (జీసీసీలు) విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.
జీసీసీలు ఏఐ, ఆటోమేషన్, ఆర్‌అండ్‌డీపై దృష్టి సారించడం వల్ల ఆవిష్కరణలకు భారత్ కీలక కేంద్రంగా మారినట్టు చెప్పారు. స్కిల్ ఇండియా, ఏఐ ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే, నైపుణ్యాల అభివృద్ధిని వేగవంతం చేయాలంటూ.. ఏఐ, సెమీకండక్టర్ పరిశ్రమల్లో అధిక నైపుణ్య మానవ వనరుల అవసరం ఉంటుందని సూచించారు.
ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం పెరుగుతున్నందున ఉత్పాదకత ఆధారిత పని నమూనాలపై కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఈవై జీసీసీ సర్వే, 2024ను ఉదహరిస్తూ.. అంతర్జాతీయ సంస్థల్లో 50 శాతం భారత్‌లో తమ జీసీసీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్టు తెలిపారు.