
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సామాజిక భద్రతా పథకం కిందకు ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.16.10 లక్షల మంది సభ్యులు చేరారు. 2024 ఫిబ్రవరి నెలలో సభ్యుల నికర చేరికతో పోల్చితే 4 శాతం ఎక్కువ మందికి ఉపాధి లభించినట్టు ఈపీఎఫ్‌వో పేరోల్ గణంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 7.39 లక్షల మంది కొత్తగా చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై విస్తృతమవుతున్న అవగాహన, ఈపీఎఫ్‌వో అవగాహన కార్యక్రమాలు కొత్త సభ్యుల చేరిక పెరిగేందుకు కారణమని కార్మిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
కొత్త సభ్యుల్లో 4.27 లక్షల మంది 18–25 ఏళ్ల వయసు నుంచి ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో వీరి వాటాయే 58 శాతంగా ఉంది. అంటే సంఘటిత రంగంలో వీరు మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. సుమారుగా 13.18 లక్షల మంది సభ్యులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరిపోయారు. గతేడాది ఇదే నెలలో పోల్చి చూస్తే 12 శాతం పెరుగుదల నమోదైంది. పాత ఖాతాను మూసివేయకుండా, కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు.
3.37 లక్షల మంది మహిళలు..
ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌వోలో నికరంగా చేరిన సభ్యుల్లో 3.37 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 2024 ఫిబ్రవరి గణాంకాలతో పోల్చి చూస్తే 9.23 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో 2.08 లక్షల మంది కొత్తగా చేరారు. 2024 ఫిబ్రవరితో పోల్చి చూస్తే కేవలం 1.26 శాతమే పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరిలో 20.90 శాతం సభ్యులు నికరంగా చేరారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యాన, ఢిల్లీ, తెలంగాణ, యూపీ నుంచి 5 శాతానికి పైన సభ్యులు నమోదయ్యారు. ఫిష్ ప్రాసెసింగ్, నాన్ వెజిటేరియన్ ఆహార కేంద్రాలు, సొసైటలు, క్లబ్‌లు, స్వీపింగ్ సేవల్లో సభ్యుల చేరిక పెరిగింది. ఎగుమతి సేవల్లో సభ్యుల చేరిక 41.72 శాతంగా ఉంది.