
వేడుకుందామా వాడపల్లీశుని..
● స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు
● ఒక్క రోజు ఆదాయం రూ 43.64 లక్షలు
కొత్తపేట: ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవింద అంటూ భక్తులు వాడపల్లి వేంకటేశుని వేనోళ్ల కొలిచారు. భక్తి పారవశ్యంతో ఓలలాడారు. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచీ అన్ని దారుల్లో భక్తులు వాడపల్లి బాట పట్టారు. భక్తుల సౌకర్యార్థం దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించి భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారి దర్శనానికి కాలి నడకన క్షేత్రానికి చేరుకున్నారు. వేలాది మంది భక్తుల రాకతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలో కొలువైన అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు.
వెంకన్న ఆదాయం రూ.43.64 లక్షలు
దేవస్థానానికి శనివారం సాయంత్రం 4 గంటల వరకూ వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. స్వామి వారి విశిష్ట దర్శనం ద్వారా రూ 11,19,400, స్వామివారి ప్రత్యేక దర్శనం ద్వారా రూ.7,53,900, వేదాశీర్వచనం ద్వారా రూ. 12,62,196, లడ్డు ప్రసాదం ద్వారా రూ.5,60,820, శాస్వత అన్నదానం నిమిత్తం రూ.,81,504, నిత్య అన్నదానానికి రూ.1,36,548, ఆన్‌లైన్ టిక్కెట్లు ద్వారా రూ.1,33,411 పాటు వివిధ రూపాల్లో మొత్తం రూ.43,64,304 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ సూర్య చక్రధరరావు తెలిపారు.
శనైశ్చరునికి పూజలు, తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేయించుకున్నారు. శనికి ప్రీతికరమైన శనివారాన్ని పురస్కరించుకుని దేవదాయ, ధర్మదాయ శాఖ ఉప కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రాతఃకాలంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భక్తుల పూజలు, తైలాభిషేకాల టిక్కెట్లు ద్వారా దేవస్థానానికి రూ.2,27,930, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.31,534 తో మొత్తం రూ.2,59,464 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు.
బాలబాలాజీ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి క్షేత్రంలో కొలువై ఉన్న బాల బాలాజీ స్వామిని శనివారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జామున స్వామి వారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి తొలి హారతి ఇచ్చి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. వివిద సేవల ద్వారా స్వామికి రూ.2,20,146 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు 44,273 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.

వేడుకుందామా వాడపల్లీశుని..