
సీజనల్ వ్యాధుల నిర్మూలనకు శ్రద్ధ
ఆలమూరు: మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా మలేరియా యూనిట్ ప్రత్యేక అధికారి ఎన్.వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని చొప్పెల్ల, పెదపళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి గ్రామాల వారీగా వ్యాధిగ్రస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పీహెచ్‌సీల పరిధిలోని చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ గ్రామాల్లోని ఇటుక పరిశ్రమల వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనారోగ్య సమస్యలుంటే సత్వరమే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఇటుక పరిశ్రమలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి అనేక మంది కార్మికులు వలస వచ్చే ఆవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
సురక్షితమైన తాగునీటితో
మలేరియా నిర్మూలన
గ్రామాల్లోని ప్రజలందరూ సురక్షితమైన తాగునీటిని వినియోగిస్తే మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చునని వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకులను నిర్ణీత సమయానికి శుభ్రపరచే విధంగా ఆరోగ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా యూనిట్ సబ్ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, ఎంపీహెచ్‌ఈఓ కె.జ్యోతికుమార్, హెచ్‌ఈ ఏవివి.రాజా, ఎంపీహెచ్‌ఎస్ పి.శివప్రసాద్, ఎంఎల్‌హెచ్‌పీ యమున, ఏఎన్‌ఎంలు శ్రీలక్ష్మి, సింధు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.