
ఓఎన్‌సీజీ రైతులను ముంచేసింది
ఆలమూరు: ఓఎన్‌జీసీ సంస్థ చిన్న, సన్నకారు రైతుల భూములను దోచుకుని నిలువునా ముంచేసిందని మండలంలోని వివిధ గ్రామాల రైతులు మండిపడ్డారు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్‌జీసీ), కాలుష్య నియంత్రణ మండలిశాఖ సంయుక్తంగా గురువారం పర్యావరణ పరిరక్షణపై అభిప్రాయం సేకరించాయి. ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్‌లోని ఎస్‌ఆర్‌జే కల్యాణ మంటపంలో ఓఎన్‌జీసీ ప్రధాన అధికారి కేవీకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిషాంతి, రామచంద్రపురం ఆర్‌డీఓ అఖిల పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఓఎన్‌జీసీకి భూములిచ్చిన రైతులు అధికారులు తగిన న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ వ్యాఖ్యానించారు. తమ భూములను లీజుకు తీసుకుని అందులో లభ్యమైన చమురు సహజ వాయువు నిక్షేపాలతో రూ.వందల కోట్ల ఆదాయాన్ని సమపార్జిస్తున్న ఓఎన్‌జీసీ మాత్రం తమకు మాత్రం తీరని అన్యాయం చేస్తోందని, రహదారులను ధ్వంసం చేస్తోందని దుయ్యబట్టారు, ఓఎన్‌జీసీ సంస్థ ఒకసారి భూములు లీజుకు తీసుకున్నాక ఏళ్ల తరబడి ఆదే లీజును చెల్లిస్తూ రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. రైతులకు ఏ అవసరం వచ్చినా ఓఎన్‌జీసీకి లీజుకిచ్చిన భూమిని అమ్ముకోవడానికిగానీ, ఎవరి వద్దనైనా తనఖా పెట్టుకుని రుణం తెచ్చుకోవడానికి ఆవకాశం ఉండడం లేదని ఆవేదన చెందారు. ఓఎన్‌సీజీ తవ్వకాలకు సంబంఽధించి చేపడుతున్న పేలుళ్ల వల్ల దెబ్బతింటున్న గృహాలకు బీమా చేయాలని పలువురు సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులతో సంప్రదించి రైతులకు న్యాయం చేస్తామని ఓఎన్‌జీసీ ప్రధాన అధికారి కేవీకే రాజు అన్నారు. ఓఎన్‌జీసీ రిగ్‌లు ఉన్న ప్రాంతాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేస్తామన్నారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రూ.84.96 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
మండపేట సీజీఎస్ పరిధిలోనున్న కొత్తపేట నియోజకవర్గాన్ని సుమారు రూ.84.96 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఓఎన్‌జీసీ ప్రధాన అధికారి రాజుకు అందజేశారు. రహదారులు, భవనాలు, కళాశాలల అభివృద్ధికి ఆ నిధులను కేటాయించాలన్నారు ఓఎన్‌సీజీ అధికారులు నాగిరెడ్డి, శంకరరావు, పర్యావరణ వేత్తలు జేటీ రామారావు, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణలో ఆగ్రహం