
ప్రమాదాల కాలం.. అప్రమత్తం..!
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
● గ్యాస్‌స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచి వాడాలి.
● అదనపు సిలిండర్‌ను వాడుతున్న సిలిండర్‌కు దూరంగా ఉంచాలి.
● కిరోసిన్, డీజిల్, పెట్రోల్‌ను సిలెండర్‌కు దూరంగా ఉంచాలి.
● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు.
● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి.
● ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎల్‌పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి.
● గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ అఫ్ చేయకూడదు.
● ఒక ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్ల్లగ్గులు పెట్టరాదు.
● ఇళ్లు వదిలిదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి.
● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్‌ను నిప్పు మీద చల్లాలి.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పి పారేయాలి.
● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి.
● కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి.
● పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై ప్రాకాలి.
● గడ్డివాములను నివాస గృహాలకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో వేసుకోవాలి.
● గడ్డివాములను గాలివాటంగా రైట్ యాంగిల్స్‌లో ఏర్పాటు చేసుకోవాలి.
● గుడిసెలకు మధ్య 30 అడుగుల దూరాన్ని పాటించాలి.
● కర్మాగారాల్లో పరిసరాల పరిశుభ్రతను అవసరం.
● కార్మికులు పనిచేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఏర్పాటు చేయాలి.
● వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం
● అవగాహనతో భారీ నష్టాలకు చెక్
● అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత
రాయవరం: భానుడు భగ్గుమంటున్నాడు. మార్చిలోనే మే నెల వచ్చిందా అన్నట్టు ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. ఈ ఏడాది 45 డిగ్రీలను దాటుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఈ కాలంలో అగ్నిప్రమాదాలు సంభవించడానికి అవకాశాలెక్కువ. మండే ఎండలకు తోడు ఇటువంటివి సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు కూడా జరిగే పరిస్థితి ఎదురవుతుంది. మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల పాటు ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏటా ఏప్రిల్‌లో జాతీయ అగ్నిమాపక దినోత్సవం
వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం పరిపాటి. 1994 ఏప్రిల్ 14న ముంబైలోని ఓడలరేవులో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు గుర్తుగా ఏటా ఈ కార్యక్రమరాన్ని నిర్వహిస్తుంటారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అగ్ని మాపక కేంద్రాలు 20 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగి పోతుంది.
ప్రమాదాలూ అధికమే
కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం కేంద్రం మినహా, మిగిలిన ఆరు నియోజకవర్గ కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసే అవకాశముంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 331 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు నాలుగు కాగా, మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10లక్షల లోపు)31, 275 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 331 అగ్ని ప్రమాదాల్లో రూ.4 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించగా, రూ.9.73 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 12 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో మూడు పశువులు చనిపోగా, ఆరు పశువులను సిబ్బంది కాపాడారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో ఆరు ఫైర్ స్టేషన్లకు సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లా ఫైర్ అధికారి పోస్టు ఖాళీగా ఉంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు రెండు, లీడింగ్ ఫైర్‌మెన్ పోస్టులు మూడు, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు ఆరు, ఫైర్ మెన్ పోస్టులు 37 ఖాళీలు ఉండగా, హోమ్‌గార్డు పోస్టులు 14 ఉండగా, ఒక్క హోమ్ గార్డు పోస్టు కూడా భర్తీ కాలేదు. ముఖ్యంగా డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల ఖాళీలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి స్టేషన్‌కు మూడు డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు ఉండాల్సి ఉండగా, ప్రతి స్టేషన్‌కు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిపైనే అదనపు భారం పడుతోంది. కొన్ని స్టేషన్లలో కొత్త వాహనాలు ఉండగా, కొన్ని స్టేషన్లలో పాత వాహనాలతోనే నెట్టుకొస్తున్నారు.
అవగాహన కోసమే వారోత్సవాలు
అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మాల్స్/మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, అవగాహన కల్పించడం, అపార్ట్‌మెంట్ల వద్ద ఎల్‌పీజీ సేఫ్టీ, నిర్లక్ష్యంగా పొగతాగడం, అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్‌పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన, ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, రోగులకు అగ్నిమాపక నియంత్రణపై అవగాహన, అంగన్‌వాడీ కేంద్రాలు, స్వచ్ఛంధ సంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తారు.
అవగాహన కల్పిస్తున్నాం
అగ్ని ప్రమాదాలను అదుపు చేయడంతో పాటు ప్రమాదాలపై ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నాం. ఇంట్లో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.
– పార్థసారధి,
జిల్లా విపత్తుల స్పందన
అధికారి, అమలాపురం
జిల్లాలో ఫైర్ స్టేషన్ల నంబర్లు
ఫైర్ స్టేషన్ ఫోన్ నంబర్లు ల్యాండ్ నంబరు
అమలాపురం 99637 27665 08856–231101
ముమ్మిడివరం 99637 28285 08856–271101
రాజోలు 99637 27827 08862–221101
కొత్తపేట 99637 28051 08855–243299
రామచంద్రపురం 99637 27545 08857–242401
మండపేట 99637 27741 08855–232101
గత మూడేళ్ల ప్రమాదాల వివరాలిలా...
సంవత్సరం ఫైర్ కాల్స్ ఆస్తి నష్టం కాపాడిన ఆస్తి
2021–22 343 43,69,600 4,03,52,000
2022–23 320 3,27,83,800 7,68,84,400
2023–24 334 41,82,30,000 19,86,89,000

ప్రమాదాల కాలం.. అప్రమత్తం..!

ప్రమాదాల కాలం.. అప్రమత్తం..!

ప్రమాదాల కాలం.. అప్రమత్తం..!