
విద్య, విజ్ఞానార్జనలో విద్యార్థులు
ముమ్మివరం: విద్యా, విజ్ఞాన అభివృద్ధికి దోహదపడేలా మూడు రోజుల విశాఖ విద్యాయాత్రను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ యాత్రలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు పాల్గొని చక్కని అనుభూతిని పొందారు. యానాం బొటానికల్ గార్డెన్‌లో మొక్కల రకాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందిన విద్యార్థులు జిప్‌మెర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అవకాశాలపై అవగాహన పొందారు. ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమలో విద్యార్థులు చెక్క బొమ్మల తయారీ, మెషినరీ, సంప్రదాయ కళారూపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విశాఖలో రుషి కొండ బీచ్, తొట్లకొండ బౌద్ధారామాలు, రామానాయుడు స్టుడియో, భీమిలి బీచ్, హిల్ వ్యూపాయింట్ తదితర అంశాలను అధ్యయనం చేశారు. అలాగే నావెల్ మ్యూజియం, సబ్‌మెరీన్ మ్యూజియం, టీ–142 యుద్ధ విమానం మ్యూజియం సందర్శించి భారత రక్షణ రంగంలోని విశిష్టతలను గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, విశాఖ నగర మున్సిపల్ కమిషనర్ విశ్వనాథంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఈ యాత్ర విజయవంతానికి కృషి చేశారు. ఈ యాత్రలో జిల్లా సైన్సు అధికారి గిరిజాల వీఎస్ సుబ్రహ్మణ్యం, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి.రాంబాబు, ఉపాధ్యాయ బృందం పాత్ర ఎనలేనిది. ఈ యాత్రపై సమగ్ర నివేదికను త్వరలో కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అందజేయనున్నట్టు డీఈఓ తెలిపారు.
రామాలయానికి వెండి కిరీటాలు
మండపేట: పట్టణంలోని 14వ వార్డు శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన రామాలయానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ దుర్గారాణి వెండి కిరీటాలు బహూకరించి తన భక్తిని చాటారు. ఆలయంలోని వినాయకుడు, లక్ష్మీదేవిలకు సుమారు లక్ష రూపాయల విలువైన వెండి కిరీటాలను సమర్పించారు. శ్రీరామ నవమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె దేవతామూర్తులకు కిరీటాలను అలంకరించారు. అనంతరం రాముల వారి కల్యాణ వేడుకల్లో పాల్గొని పానకాన్ని స్వీకరించారు. ప్రజలంతా సీతారాముల వారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం, నాయకులు తాడి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, సూరంపూడి సత్యప్రసాద్, పిఠాపురం సత్యనారాయణ, శెట్టిబలిజ సంఘం నాయకులు, మహిళలు, కమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

విద్య, విజ్ఞానార్జనలో విద్యార్థులు