
వాడవాడలవాడా.. వేంకటేశుడా..
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కల్యాణోత్సవాలు ఇలా..
● సోమవారం అంకురార్పణ, ధ్వజారోహణం
● మంగళవారం కల్యాణం, తీర్థం, రథోత్సవం
● 9న పొన్నవాహనంపై గ్రామోత్సవం
● 10న మహదాశీర్వచనం, సదస్యం
● 11న గోదావరిలో తెప్పోత్సవం
● 12న మహా పూర్ణహుతి, చక్రస్నానం
● 13న స్వామి వారి పుష్పోత్సవం
అన్ని ఏర్పాట్లూ చేశాం
గత కల్యాణోత్సవాలకు మించి భక్తుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలతో ఏర్పాట్లు చేశాం. ఆ మేరకు జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ పర్యవేక్షణలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. వారందరి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. స్వామి వారి తీర్థ, కల్యాణ మహోత్సవాల్లో భక్తులకు ఏ విధమైన ఆసౌకర్యలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– నల్లం సూర్యచక్రధరరావు, దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్,
ఆలయ ఈఓ, వాడపల్లి
కొత్తపేట: తిరుమల–తిరుపతి పెద్ద తిరుపతిగా.. ద్వారకా తిరుమల చిన తిరుపతిగా.. అదే వరుసలో అత్యంత భక్త జనాదరణ పొందిన పుణ్య క్షేత్రం వాడపల్లి. గౌతమీ–వశిష్ట గోదావరి నదుల నడుమ, గౌతమీ నదికి అతి సమీపంలో అందమైన పచ్చని పొలాల మధ్య వేంకటేశుడు వెలసిన గ్రామం వాడపల్లి. దీనికి కొద్ది దూరంలోనే విజ్జేశ్వరం సమీపంలో మరో వాడపల్లి ఉన్నందున, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలుస్తారు. ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానుడి, విశ్వాసం బాగా ఏర్పడడంతో ప్రతి శనివారం భక్తులు అఽత్యధిక సంఖ్యలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. దానితో పదేళ్లలోనే ఈస్వామి ఇంతింతయై వటుడింతయై నభోవీధిపైనింతై.. అన్నట్టు విరాట్‌రూపంగా విరాజిల్లుతున్నాడు. దీంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల జాబితాలోకి ఈ క్షేత్రం కూడా చేరింది. కోనసీమ ప్రాంతంలో ఉన్నందున కోనసీమ తిరుమలగా, రాష్ట్రంలో మూడో తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. అనాదిగా ఈ క్షేత్రంలో చైత్రశుద్ధ దశమి నుంచి చైత్రశుద్ధ బహుళ పాడ్యమి వరకూ వారం రోజుల పాటు శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ దేవదాయ – ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
వాడపల్లి క్షేత్ర స్థల పురాణం
ఈ క్షేత్రంలో ఉన్నది దారుమూర్తి. నల్లని చెక్కపై మలిచిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడి శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్రను పరిశీలిస్తే.. వైకుంఠంలోని నారాయణుని దర్శనానికి వచ్చిన సనక సనందాది మహర్షులు భూలోకంలో పెరిగిపోతున్న పాపం, అధర్మం, అన్యాయాలను తగ్గించే మార్గం చూపమని వేడుకున్నారు. అప్పుడు శ్రీమహా విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు అర్చా స్వరూపుడనై గౌతమీ ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో వెలుస్తానని మాట ఇచ్చాడు. అన్న మాట ప్రకారం లక్ష్మీదేవితో వచ్చిన స్వామివారు ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని వివరించాడు. సుమారు 400 సంవత్సరాల క్రితం గౌతమీ నదీ తీరాన వున్న నౌకాపురి తరువాత ఓడపల్లిగా తరువాతి కాలంలో వాడపల్లిగా నామాంతరం చెంది రుషులతో తపోవనంగా విరాజిల్లేది. ఆ కాలంలో దండకారణ్యంగా పిలవబడే ఈ ప్రాంతంలో స్వయంభువుగా రక్తచందనంతో స్వామివారు ఇక్కడ మూర్తీభవించారు. గోదావరి నదిలో స్వామి వారి విగ్రహం ఉన్నట్టు భక్తులకు కలలో చెప్పి ఆవిర్భవించినట్లు మరో కధ ప్రచారంలో ఉంది. ఆ విగ్రహన్ని రుషులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకు వచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహం లభించిన ప్రాంతంలో ఏటి ఓడ్డున ప్రతిష్ఠించారు. దేవర్షి నారదుడు సైతం ఈ ప్రతిష్ఠలో పాల్గొన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
550 ఎకరాల విరాళం
పినపోతు గజేంద్రుడు అనే సంపన్న వ్యాపారి 1759వ సంవత్సరంలో వాడపల్లి క్షేత్రంలో వేంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించారు. గజేంద్రుడికి స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహరాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు అప్పట్లో స్వామివారి ఆలయ నిర్వహణకు 275 ఎకారాల భూమిని విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాలను సమర్పించారు. ఈ భూములను అర్చక మాన్యాలు, మాదశి మాన్యం, రజక, మంగలి, సన్నాయి, ధూపదీప నైవేద్యం మాన్యాల కింద స్వామి వారికి సర్వ హక్కులు కల్పించారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో వీరంతా జీవనం సాగిస్తూ స్వామి వారికి సేవలు అందించేలా చేయడంతో స్వామివారి షోడసోపచారాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి.
ఏడు వారాల దర్శనంతో
స్వయం భూ వేంకటేశ్వరుని ఆలయాలను దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం కొంతకాలం పాటు సేవలు అంతంత మాత్రంగానే సాగాయి. ఇటీవలి కాలంలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెంది ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా నమ్మిన భక్తులు విశేషంగా వచ్చి స్వామిని దర్శిస్తున్నారు. అలాగే దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి శనివారం సుమారు రూ.50 లక్షలు పైబడి ఆదాయం వస్తుండగా, ప్రతి నెలా హుండీల ద్వారా సుమారు రూ.1.35 కోట్లు పైబడి ఆదాయం సమకూరుతోంది. దానితో ఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరింది.
వైఎస్సార్ సీపీ హయాంలో
అభివృద్ధి కార్యక్రమాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.కోట్ల వ్యయంతో ఈ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అవరణలో గోశాల, భారీ రేకుషెడ్లు, అన్నదాన భవన నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేశారు. రూ.55 కోట్లుతో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ 5.5 కోట్లతో వకుళమాత అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేస్తున్నారు. రూ 2.5 కోట్లతో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహణకు తిరుమల దేవస్థానం తరహాలో కోనేరు ఏర్పాటు చేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు విశ్రాంతి, సామూహిక వివాహలు, ఉపనయనాలు జరిపేందుకు వీలుగా రూ.కోట్లతో మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. రూ.65 లక్షలతో స్వామి వారికి శాశ్వత వార్షిక కల్యాణ వేదిక, మరుగుదొడ్లు, బస్సు షెల్టర్ నిర్మాణం, రూ.22 లక్షలతో తాగునీటి వాటర్ ప్లాంట్, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు. తాజాగా ఉచిత, వివిధ రుసుముల దర్శనానికి సంబందించి క్యూలైన్లు పెంచారు. ఫ్‌లై ఓవర్ ఏర్పాటుచేశారు. రావులపాలెం, బొబ్బర్లంక నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దారి పొడవునా వీధిదీపాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరుకు భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నారు.
కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన క్షేత్రం
నాటి నౌకాపురి.. నేడు వాడపల్లిగా ప్రసిద్ధి
గోదావరిలో అర్చామూర్తిగా లభ్యమై
ఏడువారాల గోవిందుడిగా కీర్తి
ఇంత నుంచి నభోవీధంత ఎదిగిని తేజం
నేటినుంచి స్వామి వారి కల్యాణోత్సవాలు

వాడవాడలవాడా.. వేంకటేశుడా..

వాడవాడలవాడా.. వేంకటేశుడా..