మన భద్రాద్రిలో.. మహావైభవంగా.. | - | Sakshi
Sakshi News home page

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

Published Mon, Apr 7 2025 12:16 AM | Last Updated on Mon, Apr 7 2025 12:16 AM

మన భద

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

వెల్లువెత్తిన భక్తులు

రామయ్య తండ్రి కల్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని కోనేరులో పలువురు తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శ్రీరామ నవమి నాడు ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. ఇక్కడి కోదండరాముని కల్యాణ తలంబ్రాలు వేసుకున్న వారికి కొద్ది కాలంలోనే వివాహం జరుగుతుందని, ముందు రోజు ఆలయానికి చేరి, నిద్రించే వారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈమేరకు పలువురు ముందురోజే ఆలయానికి చేరుకున్నారు. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు మంచి ముత్యాలతో కూడిన తలంబ్రాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో స్థానిక ఎస్సై కె.రామారావుతో పాటు తొమ్మిది మంది ఎస్సైలు, 110 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, మిత్రునిగా, సేవకునిగా, ప్రభువుగా ఎన్నో ఆదర్శాలను ఆచరించి చూపించిన మహనీయుడు ఆయన. మూర్తీభవించిన ధర్మమూర్తి. గుండెల నిండా కారుణ్యాన్ని నింపుకొన్న దయామూర్తి. శరణన్నవారికి అభయప్రదాత. ఆనందాన్ని పంచే పట్టాభిషేక సమాచారాన్ని.. ఆందోళన కలిగించే వనవాసాన్ని సమానంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు. సమస్త సుగుణాలను రాశిగా పోస్తే అదే ఆయన రూపం. ఆ సకల సుగుణాభిరాముడు అయిన రామచంద్రమూర్తి.. సీతమ్మవారిని మనువాడిన అపురూప సన్నివేశాన్ని తిలకించి.. భక్తజనకోటి ఆనందంతో పులకించింది.

పెదపూడి: బుగ్గన చుక్కతో, పట్టుపుట్టాలు ధరించి, సర్వాభరణభూషితురాలై, నునుసిగ్గులు ఒలకబోస్తూ సీతమ్మ తల్లి.. సమస్త ఆభరణాలూ అలంకరించుకుని, నూతన వస్త్రాల్లో మెరిసిపోతూ రామయ్య తండ్రి.. వధూవరులుగా పెళ్లి పీటలపై కొలువుదీరిన వేళ.. వారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులే అయ్యారు. వేద పండితులు సుస్వరంగా మంత్రాలు చదువుతూండగా.. మంగళ వాయిద్య ఘోష, భక్తుల ‘జై శ్రీరామ్‌’ నామస్మరణలు నలుదిశలా ప్రతిధ్వనిస్తూండగా.. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో.. రెండో భద్రాద్రిగా ఖ్యాతికెక్కిన గొల్లల మామిడాడ గ్రామంలో కోదండరాముని కల్యాణోత్సవం.. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం కన్నుల పండువగా జరిగింది.

కల్యాణోత్సవం జరిగిందిలా..

ఆలయ అర్చకులు, వేద పండితులు కోదండ రాముని కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు స్వామి, అమ్మవారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీతారాములకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబు దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు తలంబ్రాలుగా మంచి ముత్యాలు సమర్పించారు. 11.45 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పండితులు కల్యాణోత్సవ సంకల్పం ప్రారంభించారు. లోకకల్యాణ కారకమైన సీతారాముల కల్యాణ క్రతువుకు ఎటువంటి విఘ్నాలూ రాకూడదని ప్రార్థిస్తూ తొలుత విష్వక్సేన పూజ నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం వధూవరులకు మధ్యాహ్నం 2.08 గంటలకు రక్షాబంధనం కట్టారు. ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం’ అంటూ మంత్రాలు పఠిస్తూ కోదండ రామచంద్రునికి 2.20 గంటలకు యజ్ఞోపవీత ధారణ గావించారు. అనంతరం వధూవరులకు పూలమాలలు అలంకరించారు. ‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ..’ అనే శ్లోకం చదువుతూ మిథిలాధిపతి జనక మహారాజు తరఫున అర్చకులు సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 3.03 గంటల సుముహూర్తానికి వధూవరుల శిరస్సులపై జీలకర్ర – బెల్లం ఉంచారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించి, హారతి ఇచ్చారు. కోదండ రామచంద్రమూర్తి చేతులకు అర్చకులు మాంగల్య సూత్రాన్ని తాకించి, సీతమ్మ వారి మెడలో అలంకరించారు. అనంతరం మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసి, వేడుక నిర్వహించారు.

కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణం భక్తజనసంద్రమైన గొల్లల మామిడాడ వేలాదిగా తరలివచ్చిన భక్తులు

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..1
1/4

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..2
2/4

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..3
3/4

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..4
4/4

మన భద్రాద్రిలో.. మహావైభవంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement