
ఏకపక్ష నిర్ణయాల్లో శభాష్!
● ఆశావహులను కాదని
అయినవారికి పదవులు
● అటు తమ్ముళ్లూ..
ఇటు సైనికుల అసంతృప్తి
● అధిష్టానాలకు లేఖాస్త్రాలు
సంధిస్తున్న వైనం
రామచంద్రపురం: కూటమి ప్రభుత్వంలో మొదలైన పదవుల పందేరంలో నియోజకవర్గ అమాత్యుడు తీసుకుంటున్న నిర్ణయాలు మిత్రపక్షం జనసేనకు మింగుడుపడడం లేదు. ఎన్నికల అనంతరం జనసేన వల్లనే గెలిచానని చెప్పుకొచ్చిన మంత్రి సుభాష్ పదవుల పంపకం వచ్చే సరికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు మధన పడుతున్నారు. తాజాగా కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎండోమెంట్ ట్రస్ట్ చైర్మన్, అగస్త్యేశ్వరస్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ ఎంపిక సిఫార్సుల్లో మంత్రి నిర్ణయంతో జనసేనకు ఎదురు దెబ్బ తగిలిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీలో సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అంతా మంత్రి, ఆయన తండ్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎక్కడో ఉండి వచ్చిన వారిని అందలాలు ఎక్కించడం వెనుక మర్మమేమిటని సీనియర్ టీడీపీ నేతలు అధిష్టానానికి రాసిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంతో పాటుగా రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు ప్రతిష్టాత్మకమైన కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎండోమెంట్ ట్రస్ట్ చైర్మన్ పదవిని జనసేన నేతలు పట్టణానికి చెందిన ఒక ప్రముఖ వైద్యునికి ఇవ్వాలని మంత్రికి సూచించినట్టు తెలిసింది. తీరా ఆ వైద్యుడిని ఒప్పించి మంత్రి వద్దకు తీసుకువెళ్లగా, ఆ పదవికి అప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని ఒక పేరును చెప్పడంతో జనసేన నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. పట్టణంలో ఒక పాఠశాలలో కొద్ది నెలల కిత్రం పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడికి కృత్తివెంటి ట్రస్టు చైర్మన్ ఇవ్వడానికి మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. పట్టణానికి చెందిన ఆ ప్రముఖ వైద్యుడు చైర్మన్ అయితే హుందాగా ఉండేదని జనసేన నేతలు అంటున్నారు. సదరు ఉపాధ్యాయునికి పదవి కట్టబెట్టడంపై ఏం జరిగి ఉంటుందోనని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ట్రస్టు చైర్మన్ విషయం కూడా వివాదంగా మారినట్లు తెలుస్తోంది. ఆలయాల్లో పనిచేసే ఒక అర్చకునికి ఈ చైర్మన్ పదవిని ఇచ్చేందుకు సిఫార్సు చేశారని, అయితే ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు మంత్రి గెలుపు కోసం పనిచేశామని వారికి కాకుండా పదవుల పంపకంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటంతో అటు జనసేన, ఇటు టీడీపీ క్యాడర్‌లోను తీవ్ర అసంతృప్తి రగులుతోంది.
అటకెక్కిన సమన్వయ కమిటీ
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత ఎవరికి వారు బాధ్యతలు తీసుకోకపోవటంతో కంగుతిన్న మంత్రి, ఆయన తండ్రి కలిసి నియోజకవర్గ, మండల, పట్టణ సమన్వయ కమిటీలను తెరపైకి తీసుకువచ్చారు. వారి ఆధ్వర్యంలోనే అన్ని పనులు జరుగుతాయని నమ్మబలికారు. చివరికి ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయా సమన్వయ కమిటీలను అటకెక్కించిన వైనం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో అటు టీడీపీ, ఇటు జనసేనలో సీనియర్ నేతలు మంత్రి, అయన తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ఎదురవుతున్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు వారి అధిష్ఠానానికి లేఖల ద్వారా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.