అణచివేతే పరిష్కారమా?! | Amit Shahs statements that Maoists will be eliminated by next year | Sakshi
Sakshi News home page

అణచివేతే పరిష్కారమా?!

Published Sat, Mar 22 2025 3:37 AM | Last Updated on Thu, Apr 3 2025 5:53 PM

Amit Shahs statements that Maoists will be eliminated by next year

చాన్నాళ్లుగా ఘర్షణాత్మక ప్రాంతంగా ముద్రపడిన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులకూ, భద్రతా బలగాలకూ మధ్య గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులూ, ఒక డీఆర్‌జీ జవాను మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 113మంది నక్సలైట్లు మరణించారు. నిరుడు ఇదేకాలంలో 29 మంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం ప్రభుత్వ దృఢ సంక ల్పాన్ని తెలియజెబుతుంది. 

మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెడతామని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇంతవరకూ 104 మందిని అరెస్టు చేశామని,164 మంది లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.ముఖ్యంగా 3,900 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్‌ అటవీప్రాంతంలోకి మావోయిస్టులు మినహా అన్యులు ప్రవేశించటం అసంభవమన్న అభిప్రాయంవుండేది. అక్కడే మావోయిస్టు శిక్షణ శిబిరాలు, భారీ ఆయుధ డంప్‌లు, ఆహారపదార్థాల గోడౌన్‌ లుండేవి. పల్లెసీమల్లో వారికి గట్టి పట్టుండేది. 

ఇప్పుడక్కడ దాదాపు 300 వరకూ కేంద్ర బలగాల స్థావరాలున్నాయి. ఇవిగాక సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ దళాల శిబిరాలున్నాయి. బస్తర్‌ అడవుల్లోఅత్యంత మారుమూల ప్రాంతం కావటంవల్ల, చుట్టూ వున్న ఎత్తయిన కొండలు, వాటిపై దట్టంగా విస్తరించిన వృక్షాలుండటంవల్ల మావోయిస్టులకు అది రక్షణ కవచంగా ఉండేది. దాన్ని ‘విముక్త ప్రాంతం’గా పరిగణించేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంవల్లే వారి అణచివేత వేగం పుంజుకుందన్న అభిప్రాయం పాక్షిక సత్యం మాత్రమే. 

యూపీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మావోయిస్టులను ‘జాతీయ భద్రతకు పెనుముప్పు’గా ప్రకటించారు. తదనుగుణంగా అనేక చర్యలు మొదలయ్యాయి. అప్పటి హోంమంత్రి చిదంబరం ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ పేరుతో నక్సల్స్‌ ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అదిప్పుడు ‘ఆపరేషన్‌ కగార్‌’ అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు క్రమేపీ పైచేయి సాధించాయి. కేంద్రంలో ఎవరున్నా నక్సల్స్‌ అణచివేతలో ఛత్తీస్‌గఢ్‌కు పూర్తి సహకారం అందింది.

రాజ్యానికుండే ఆయుధ సంపత్తి, దాని సుశిక్షిత భద్రతా బలగాల ముందు ఎవరూ సరి పోరన్నది వాస్తవం. ఆ అంబులపొదిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత చేరింది. అందువల్లే కావొచ్చు... దట్టమైన అరణ్యాల్లో సైతం మావోయిస్టు దళాల కదలికలను వెంటనే నిఘా వర్గాలు గుర్తించగలుగుతున్నాయి. అబూజ్‌మÉŠ  అరణ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయగలిగేలా నిఘా డ్రోన్‌లు సంచరిస్తున్నాయి. ఇప్పటికేవున్న భద్రతా బలగాలకు అదనంగా గత నెలలో మరో 2,500 మంది జవాన్లను తరలించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. 

జిల్లా రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పేరిట ఏర్పాటు చేసిన బలగాలు కేంద్ర దళాల చేతుల్లో తిరుగు లేని ఆయుధం. ఎందుకంటే డీఆర్‌జీలో దాదాపు అందరూ ఆదివాసీ తెగలవారు. మావోయిస్టుల్లో పనిచేసినవారు. వీరికి ఆ ప్రాంతం కొట్టిన పిండి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని దుర్గ మారణ్యాల్లో వీరు సునాయాసంగా చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసి వెలుపలికొచ్చినవారినీ, ఇతరులనూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ‘సల్వాజుడుం’ పేరిట సమీకరించి ఆయు ధాలిచ్చి, వారిద్వారా మావోయిస్టుల్ని అణచడానికి ప్రయత్నించింది. ఇలా ప్రైవేటు సైన్యాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.   

దురదృష్టమేమంటే భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగే పోరుతో సంబంధంలేని సాధారణ ఆదివాసీ ప్రజానీకం సైతం భయంతో బతకాల్సి వస్తున్నది. ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో, ఏజెన్సీప్రాంతాల్లో నక్సల్స్‌కు సహకరిస్తున్నారన్న అనుమానంతో సాధారణ పౌరులను పోలీసులు వేధించే వారన్న అభిప్రాయం వుండేది. 

అలాగే నక్సల్స్‌ సైతం ఇన్ఫార్మర్ల పేరిట అనేకుల్ని హతమార్చిన ఉదంతాలు ఉండేవి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్లలో పదులకొద్దీమంది మరణిస్తున్నారు. కానీ వారంతా మావోయిస్టులేనా? ఆ ఉదంతాలు జరిగాక హక్కుల సంఘాలు చేసే ప్రకటనలు తప్ప అక్కడికి మీడియా వెళ్లి జరిగిందేమిటో చెప్పే పరిస్థితులు లేవు. అటు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్ల పేరిట కొందరిని హతమారుస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి.

వచ్చే ఏడాదికల్లా మావోయిస్టుల్ని అంతం చేస్తామన్న అమిత్‌ షా ప్రకటనలు నెరవేరే అవకాశం ఉండొచ్చని వరస ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లోని 126 జిల్లాలు నక్సల్స్‌ ప్రభావంలోవుంటే నిరుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. రహదారుల నిర్మాణం కూడా జోరందుకుంది. కానీ ఇవి మాత్రమే తిరుగుబాటునూ, అసంతృప్తినీ అంతర్థానం చేస్తాయని భావించటం పొరపాటు. 

ఆదివాసీ సంస్కృతినీ, అక్కడి సహజవనరులనూ పరిరక్షించటానికి చర్యలు తీసు కుంటేనే... ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించి, రాజ్యాంగం పూచీపడిన హక్కులు సక్రమంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇందిరాగాంధీ హయాంలో బీడీ శర్మ వంటి అంకిత భావంతో పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు బస్తర్‌ ప్రాంత అభివృద్ధికీ, ఆదివాసీల సంక్షేమానికీ ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement