
సృజనాత్మక శక్తి కలిగిన క్రియేటర్లకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారుతోంది. పలువురు యువతీ యువకులు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. అత్యధిక ఫాలోవర్లను, వ్యూస్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్న సిటీ డిజిటల్ స్టార్స్‌ను సొంతం చేసుకునేందుకు, మరింత మందిని తమవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాయి. విభిన్న రకాల ఈవెంట్లతో నగర యువతను
ఊపేస్తున్నాయి.
ఈ యాప్స్ ఉపయోగించేవారిలో అత్యధికులు టీనేజర్లు, అందులో యువతులు ఉండడంతో ఈ ఆన్‌లైన్ యాప్స్ వారి కోసం నగరంలో పలు ఆఫ్‌లైన్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాయి. క్రియేటర్లకు అవగాహన, మార్గదర్శకత్వం అందించడంతో పాటు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ మరింత రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ ఉపయోగించుకుంటూ ప్రకటనలు పొందడం, మానిటైజేషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపైనా అవగాహన కలిగిస్తున్నాయి.
హైదరాబాద్ తొలి ప్రాధాన్యత..
దేశవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల క్రియేటర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ వేదిక స్నాప్‌చాట్ తన తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్‌లో గత బుధవారం నిర్వహించింది. క్రియేటర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు ఆదాయం ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించినట్టు స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు తోడ్పడేందుకు నగరానికి చెందిన క్రియేటివ్ మీడియా సంస్థలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్, సిల్లీ మాంక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు.
ప్రత్యేకంగా క్రియేటర్ డే సృష్టి..
అంతర్జాతీయ స్థాయిలో క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా క్రియేటర్స్ డే కూడా నిర్వహిస్తున్నారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టా ముంబయి, బెంగళూర్ సహా హైదరాబాద్‌లో నూ క్రియేటర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పాటే ఔత్సాహిక యువత కోసం ఈ యాప్స్ గతేడాదిలో క్రియేటర్స్ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. నటి రష్మిక మందన్న, హీరో నానితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటుండడంతో వీటికి యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని క్రియేటర్స్ హబ్‌గా చూడడం తథ్యం అనిపిస్తోంది.
సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవడం బాగుంది..
‘యూ ట్యూబ్, ఇన్‌స్టా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది, లక్షలాది మందితో కనెక్ట్ అవ్వొచ్చు’ అని చెప్పారు యాంకర్ లాస్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది లాస్య.. ప్రత్యేకంగా ఇలాగే చేయాలనే ముందస్తు ప్లాన్స్ లేకుండా అప్పటికప్పుడు చేసే సరదా బిట్స్ కూడా వీక్షకాదరణ పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టీవీకి, సినిమాకీ కొంత దూరంగా ఉన్నా, దీని ద్వారా ఆ లోటు తీరుతోంది.
అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమే. నా భర్త మంజునాథ్‌తో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ సోషల్ మీడియాలో క్రియేటర్స్‌గా రాణించాలంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ, కొత్త కొత్త పోకడలు అందిపుచ్చుకుంటూ ఉండడం అవసరం. దీనికి ఈ యాప్స్ నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ ఈవెంట్స్ బాగా ఉపకరిస్తున్నాయి. ఈ కారణంగానే మేము స్నాప్ చాట్ ఏర్పాటు చేసిన క్రియేటర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాం.
– మంజునాథ్ లాస్య (యాంకర్)
(చదవండి: పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?)