
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు..
నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు.
నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు.
మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు.
(చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!)