సైన్సును తొక్కిపెట్టడం ప్రజాహితమా? | Sinking Town In Uttarakhand: What Went Wrong With Joshimath An Analysis | Sakshi
Sakshi News home page

సైన్సును తొక్కిపెట్టడం ప్రజాహితమా?

Published Fri, Feb 17 2023 1:13 AM | Last Updated on Fri, Feb 17 2023 1:56 AM

Sinking Town In Uttarakhand: What Went Wrong With Joshimath An Analysis - Sakshi

జోషీమఠ్‌ కొంతకాలంగా కుంగిపోతూ ఉందని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఇచ్చిన కీలకమైన నివేదికను గుర్తించడానికి బదులుగా... దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ నిషేధాజ్ఞను జారీ చేసింది. శాస్త్రీయ సమాచారాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించడంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తన అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో సైన్స్‌ పాత్రకు సంబంధించింది. జీఎం ఆహార పదార్థాలు, నాసిరకం మందులు, డేటా గోప్యత, సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో నిపుణుల అభిప్రాయాలు ఆరోగ్యకరమైన చర్చకు వీలుకల్పిస్తాయి.

జోషీమఠ్‌ సంక్షోభం మరొక తత్సమానమైన తీవ్ర సవాలును దేశం ముందు ఉంచింది. అదేమిటంటే భారతీయ శాస్త్ర పరిశోధనా మండలులను, విద్యావిషయిక సంస్థలను నెమ్మదిగా క్షీణింపజేస్తూ రావడమే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ అనుబంధ విభాగమైన హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) అందించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాపై ఆధారపడి, జోషీమఠ్‌ కుంగుబాటుపై కీలకమైన ప్రాథమిక అంచనా జనవరి 11న వెలువడింది. 2022 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య జోషీమఠ్‌ 9 సెంటీమీటర్లు కుంగిందనీ, డిసెంబర్‌ 27 నుంచి 2023 జనవరి 8 మధ్యలో మరింత వేగంగా కుంగిందనీ ఈ నివేదిక తెలిపింది. జోషీమఠ్‌లో పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపిన మొట్టమొదటి శాస్త్రీయ నివేదిక ఇదే.

ఈ నివేదిక తీవ్రతను గుర్తించి, సకాలంలో వ్యవహరించడంలో తాను విఫలమయ్యాయని ఒప్పుకోవడానికి బదులుగా శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎమ్‌ఏ) నిషేధాజ్ఞను జారీ చేసింది. సాంప్రదాయిక లేదా సామాజిక మాధ్యమాల ద్వారా జోషీమఠ్‌పై ఎలాంటి సమాచారాన్ని లేక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవద్దని ఆదేశించింది. ఎన్‌ఆర్‌ఎస్‌సి, ఇస్రోలను మాత్రమే కాదు; శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి; శాస్త్ర, సాంకేతిక విభాగం; జలవనరుల మంత్రిత్వ శాఖ; ఐఐటీ–రూర్కీతోపాటు సర్వే ఆఫ్‌ ఇండియా, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి పలు శాస్త్రీయ సంస్థలకు చెందిన పరిశోధనా ల్యాబ్‌ల నోరు మూయించారు. 
ఈ సందర్భంగా ఎన్‌డీఎమ్‌ఏ ఆదేశం కనీవినీ ఎరుగనిదీ. ఎన్‌డీఎమ్‌ఏ కానీ, హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ శాస్త్రీయ పరిశోధనా సంస్థల మాతృసంస్థలు కావు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్‌డీఎమ్‌ఏ ఆదేశం సూచించినందున, ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే. ఇస్రో, íసీఎస్‌ఐఆర్‌ వంటి సంస్థలు కాగితం మీద అయినా సరే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇవి హోంశాఖ పర్యవేక్షణలో లేనేలేవు. కొద్దినెలల క్రితమే, అన్ని శాస్త్ర విభాగాల కార్యదర్శులతో సమావేశానికి పిలుపునిచ్చిన హోంశాఖ కార్యదర్శి తన అధికారాల పరిధిని అతిక్రమించడమే కాకుండా ఇంతవరకు శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇచ్చిన అవార్డులన్నింటినీ ఒక్క కలంపోటుతో రద్దు చేసిపడేశారు. జన్యుపరంగా పరివర్తింపజేసిన ఆహార ధాన్యాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దంటూ... పనిచేస్తున్న, రిటైరైన శాస్త్రవేత్తలను ఐసీఏఆర్‌ ఇటీవలే తీవ్రంగా హెచ్చరించింది. 

శాస్త్ర పరిశీలనలపై ఆధారపడిన చర్చలు, వాటి సమాచారాన్ని ప్రజలకు పంచిపెట్టడాన్ని ప్రోత్సహించాలి. అనేక రంగాలలో శాస్త్రవేత్తలు నిత్యం డేటాను పంచుకుంటారు. అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిష్ట్రేషన్‌ (నాసా)కు రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను నిత్యం షేర్‌ చేసే పోర్టల్స్‌ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చోటుచేసుకున్నా దానికి సంబంధించిన డేటాను యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే వెబ్‌సైట్‌లో రియల్‌ టైమ్‌లో అందుబాటులో ఉంచుతుంటారు. ఇక జెనెటిక్‌ సీక్వెన్స్‌  డేటాబేస్‌లు ప్రపంచమంతటా శాస్త్రపరిశోధకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఎన్‌ఆర్‌ఎస్‌సి రూపొందించిన అంచనాల్లో ఒక భాగం, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఉపగ్రహం సెంటినెల్‌–1 నుంచి తీసిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఈ ఉపగ్రహం సింథెటిక్‌ అపెర్చుర్‌ రాడార్‌ని కలిగివుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు డేటాను సేకరించడంలో ఇది తోడ్పడుతుంది. ఎన్‌ఆర్‌ఎస్‌సి మదింపులో రెండో భాగం భారతీయ ఉపగ్రహమైన కార్టోసాట్‌–2ఎస్‌ నుంచి పంపిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఇది 0.65 మీటర్ల రిజల్యూషన్‌ తో అన్ని రంగులను గుర్తించగలిగే ఛాయచిత్రాలను అందిస్తుంది. ఈ నేప
థ్యంలో ఇఎస్‌ఏ, ఇస్రో నుండి పొందిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను ఉపయోగించుకునే విశ్లేషణతో ముందుకొచ్చే ఎన్‌ఆర్‌ఎస్‌సి డేటాను ఎవరైనా అభినందించాలి తప్ప ఆంక్షలు విధించరాదు. ఈ విశ్లేషణ... ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారిలోనే కాకుండా, దేశ పౌరుల్లో కూడా గందరగోళాన్ని రేకెత్తిస్తున్నట్లు ఎన్‌డీఎమ్‌ఏ కనిపెట్టింది మరి.
రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను ఉపయోగించడంపై చర్చ ఉత్తరాఖండ్‌ ఉదంతం నేపథ్యంలో చోటు చేసుకుంటోంది. ఎందుకంటే భారత్‌లో రిమోట్‌ సెన్సింగ్‌ అధ్యయనాలకు ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ జన్మస్థలం. ఇక్కడే భారతీయ ఫొటో ఇంటర్‌ప్రెటేషన్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐపీఐ)ని 1966లో స్థాపించారు. ఇది 1957లో జవహర్‌లాల్‌ నెహ్రూ నెదర్లాండ్స్‌ సందర్శన సందర్భంగా కుదిరిన ఒప్పంద ఫలితం. ఐపీఐ... భారతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దీన్ని 1969లో ఏర్పడిన ఇస్రోకు బదలాయించారు. ఇప్పుడు ఇది ఇస్రో నేతృత్వంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ పేరిట వ్యవహరిస్తోంది.

మొట్టమొదటి భారతీయ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ 1988లో ఐఆర్‌ఎస్‌–1ఏ పేరిట ఆపరేషన్లను ప్రారంభించింది. ఈరోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు నాలుగు అత్యధునాతనమైన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలున్నాయి. అవి రిసోర్స్‌శాట్, కార్టోశాట్, ఓషనోశాట్, రైశాట్‌. భారతీయ ఫారెస్ట్‌ మ్యాప్‌ రూపకల్పన కోసం రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను 1980లలో ఉపయోగించి, ఇస్రో చారిత్రాత్మకమైన తోడ్పాటును అందించింది. ఇది దేశంలో భారీ ఎత్తున అడవుల నరికివేత జరిగిందని చూపించింది. అంతవరకు భారతీయ ఫారెస్ట్‌ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) రూపొందించిన ఫారెస్టు మ్యాప్‌లతో ఇస్రో మ్యాప్‌లు విభేదించాయి. ఈ కొత్త డేటా వెల్లడించినందుకు నోరు మూసుకోమని ఎవరూ ఆదేశించలేదు. దానికి బదులుగా, భారతీయ ఫారెస్ట్‌ సర్వే సంస్థ తన మ్యాపింగ్‌ ప్రక్రియలో రిమోట్‌ సెన్సింగ్‌ ఆధారిత టెక్నిక్‌ను పొందుపర్చుకోవడానికి అనుమతించారు. దీనివల్ల అడవుల విస్తీర్ణంపై కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యమైంది. 

నిపుణుల జ్ఞానాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించే విషయంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి, డేటాను షేర్‌ చేసే హక్కుకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ విధాన నిర్ణయంలో, ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సైన్స్‌ పాత్రకు సంబంధించిన విషయం. డేటాను పంచుకోవడం, నిపుణుల అభిప్రాయాలు లేక పరిశోధనా పత్రాలు అనేవి... జీఎం– ఆహార పదార్థాలు, హిమాలయ పర్యావరణం, నాసిరకం మందులు, డేటా గోప్యత లేదా సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో ఆరోగ్యకరమైన చర్చలకు వీలుకల్పిస్తాయి. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వివిధ అంశాలపై నిపుణులతో కూడిన విద్యా కేంద్రాలకు సంబంధించి విస్తారమైన నెట్‌వర్క్‌ కలిగి ఉన్న భారత్‌ వంటి దేశంలో, భిన్నాభిప్రాయాలు నిత్యం రంగంమీదికి వస్తుంటాయి. ఇలాంటి విభేదాలను సైంటిస్టులు, విద్యావేత్తలు, పౌర సమాజం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన ప్రజా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. 1980లలో, కైగా అణు విద్యుత్‌ సంస్థపై తీవ్రవివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌... దేశంలోని అణు శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తల మధ్య ఒక చర్చను నిర్వహించింది. ఈరోజుల్లో అలాంటి చర్చలనుంచి పరిశోధనా మండలులు, విద్యా సంస్థలు దూరం జరుగుతున్నారు. వీటి మౌనంతో శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిని మరింతగా క్షీణింప జేసేందుకు ప్రభుత్వానికి ప్రోత్సాహం లభిస్తోంది.


దినేశ్‌ సి. శర్మ , వ్యాసకర్త శాస్త్ర వ్యవహారాల వ్యాఖ్యాత,
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement