ఐసిస్‌ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా? | ISIS terrorism on rise again: chaos in Syria | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?

Published Wed, Dec 11 2024 3:44 AM | Last Updated on Wed, Dec 11 2024 3:44 AM

ISIS terrorism on rise again: chaos in Syria

సిరియాలో అల్‌ఖైదా, ఐసిస్‌ మూలాలున్న మాజీ ఉగ్రవాది ముఠా చేతుల్లోకి అధికారం

ఈ నేపథ్యంలో మళ్లీ పెరిగిన ఉగ్రభయాలు

ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్‌ అల్‌ అసద్‌ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.

అసద్‌ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్‌ అల్‌ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్‌ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్‌ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?
ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్‌ ఇస్లామిక్‌ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్‌లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టీఎస్‌) చీఫ్‌ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్‌ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.

ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్‌ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్‌ అసద్‌ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్‌ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్‌ చీఫ్‌ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.

అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్‌ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్‌ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. 

ఐసిస్‌ ప్రభావమెంత?
బషర్‌ అసద్‌ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్‌ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్‌కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ గణాంకాల్లో వెల్లడైంది.

 ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్‌ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్‌ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ఐసిస్‌ను ఎలా కట్టడిచేశారు?
హెచ్‌టీఎస్‌ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్‌ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్‌ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్‌ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్‌ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.

కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్‌ పని అయిపోయిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్‌ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్‌ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ సగేర్‌ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.

ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?
హెచ్‌టీఎస్‌ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్‌ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్‌ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.

ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే సోఫాన్‌ గ్రూప్‌ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్‌ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్‌ నుంచి  సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్‌ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్‌ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement