
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్‌లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.