
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన.
వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన.
అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన.

ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది.
ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన.