
పొరుగూరు వెళ్లి లాడ్జిలో దిగారనుకోండి.. వచ్చేటప్పుడు పోయేటప్పుడు తలుపులు తీసి.. దర్బాన్లు మనకు సెల్యూట్ చేస్తూంటే.. మన మనసు మూలల్లో ఎక్కడో ఒకచోట గర్వంగా ఫీల్ అవుతూంటాం! థ్యాంక్స్ టు రోబోటిక్స్ ఇప్పుడు ఈ చిన్ని ఆనందానికీ మనం దూరం కావల్సిందే! ఎందుకంటారా...?
రోబో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకు ఉద్యోగాలు తక్కువైపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వినపిస్తున్నదే. తాజా నిదర్శనం.. చైనీస్ కంపెనీ పుడు రోబోటిక్స్ అభివృద్ధి చేసిన ఫ్లాష్‌బోట్! మనిషి మాదిరిగానే ఎంచక్కా రెండు కాళ్లపై నడవడం మాత్రమే దీని ప్రత్యేకత కాదు. హోటళ్లు తదితర భవనాల్లో తలుపులు తీయడం, వేయడం... లాడ్జీల్లోనైతే వచ్చిన అతిథి సామాను మోసుకుని గది చూపించడం కూడా చేసేస్తుంది ఇది.
ఫొటోలు చూడండి.. ఎంత వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉందో ఈ ఫ్లాష్‌బోట్. చేయి చాచితే మాత్రం ఆరు అడుగుల దూరంలోని వస్తువులను కూడా ఒడుపుగా పట్టుకోగలదు ఇది. ఇందుకు తగ్గట్టుగా పుడు రోబోటిక్స్ అత్యాధునిక డీహెచ్11 రోబో చేతులను అమర్చింది దీనికి. ఎత్తు తక్కువగా ఉన్నా లిఫ్ట్‌లలో సులువుగా బటన్స్ నొక్కేందుకు, వస్తువులను పట్టుకునేందుకు ఈ పొడవాటి చేతులు ఉపయోగపడతాయి అన్నమాట. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పుణ్యమా అని ఈ ఫ్లాష్‌బోట్ గొంతు కూడా అచ్చం మనిషిని పోలి ఉంటుంది. చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగల సామర్థ్యమూ అబ్బింది. కాబట్టి ప్రత్యేకమైన సైగలు, బటన్స్ నొక్కే అవసరం లేకుండా చేయాల్సిన పనిని మనమే నేరుగా చెప్పేయవచ్చు.
ఫ్లాష్‌బోట్ ముఖ భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్ ఉంటుంది. దాంట్లో అమర్చిన సెన్సర్ల సాయంతో ఇది తన పరిసరాలను స్కాన్ చేయగలదు. ఏది ఎక్కడుందో గుర్తించేందుకు ఆర్జీబీ డెప్త్ కెమెరాలు, పానోరామిక్ కెమెరాలు, త్రీడీ మ్యాపుల కోసం, అడ్డంకులను గుర్తించి తప్పించుకునేంఉదకు లైడార్లు కూడా ఉన్నాయి దీంట్లో. హోటళ్లలో ఈ రోబోను వాడితే అతిథుల సామాన్లు మోసేందుకు ప్రత్యేకమైన క్యాబిన్‌లాంటిది కూడా ఉంటుంది. ఫలితంగా రోబో చేతులను ఇతర పనులకు వాడవచ్చు. ఫ్లాష్‌బోట్ ఒకొక్కటి సుమారు 15 కిలోల బరువుంటుంది. నాలుగు గంటలపాటు ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు పనిచేయగలదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఖరీదెంత? వంటి వివరాలు కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
(ఫొటోలు, వీడియోలు పుడు రోబోటిక్స్ సౌజన్యంతో)