
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ..
ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’ అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ.. అంటూ భక్తిభావం కలిగించాడు. అర్ధశతాబ్దపు అజ్ఞాన్ని స్వతంత్రం అందామా అంటూ.. అగ్నిజ్వాలలను రగలించే పాటలను రాశారు. తెల్లారింది లెగండొయ్ అంటూ స్ఫూర్తిని నింపారు. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ ప్రేమగీతాలను రాశారు.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని
కేవలం ఒక్క జోనర్‌కు అని పరిమితం కాకుండా సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వంలో ఎన్ని విభాగాలు ఉంటే అన్నింటిలోనూ పాటలను రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో 3వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెలకు కొన్ని రకాల పాటలు రాయడం అస్సలు నచ్చదట. ఎంత డబ్బు ఇచ్చిన సరే అలాంటి పాటలు రాసేవాడు కాదట. ఈ విషయాన్ని సిరివెన్నెల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలను రాయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సిరివెన్నెల ఓ సందర్భంలో తెలిపారు.
చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు
‘సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై నన్ను పాటలు రాయమని చెప్పొద్దని డైరెక్టర్లు, నిర్మాతలకు చెప్పేవాడిని. నా అనుభూతుల్ని మాత్రమే పాటలుగా రాస్తాను. కఠినమైన పాట రాసేంత భాష నాకు రాదు. నాకు అష్టైశ్వర్యాలు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా నా పాటలు ఉండాలనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనైన నా పాటల్లో స్త్రీని కించపరచను. సినిమాలో ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే అవమానిస్తూ రాయడం నాకు ఇష్టం ఉండదు. నా పాటల్లో శృంగార రచనలు చేస్తాను.. కానీ అవి కుటుంబ సభ్యులతో కలిసి వినగలిగేలా ఉంటాయి. అంతేతప్ప అంగాంగ వర్ణనలు మాత్రం చేయను. ఇక కుర్రకారును రెచ్చగొట్టే పాటలు అస్పలు రాయను’ అంటూ ఆయన చెప్పకొచ్చారు.