కోవెలకుంట్ల/దొర్నిపాడు/ఉయ్యాలవాడ: ఉదయం నుంచి భానుడు విశ్వరూపం ప్రదర్శించగా.. సాయంత్రం ఒక్క సారిగా వరుణుడు ఇక తన వంతు అన్నట్లుగా విరుచకపడ్డాడు. అప్పటి వరకు భగభగమన్న సూర్యుడు మబ్బుల చాటుగా వెళ్లగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పంట కోతలు పూర్తయి కల్లాల్లో మిరప, పొగాకు, మొక్కజొన్నలు దిగుబడులు ఆరబెట్టారు. ఈ క్రమంలో వర్షం పడటంతో దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో వర్షం కారణంగా మొక్కజొన్న, మిరప దిగుబడులు తడిచిపోయాయి. దిగుబడులు తడవకుండా కప్పినా పట్టలపై నీరు నిలిచి తడిచి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పందిర్లపై ఆరబెట్టిన పొగాకు తోరణాలు తడి చి ముద్దయ్యాయి. కోవెలకుంట్లలోని పలు వీధులు జలమయమయ్యాయి. అకాల వర్షం వేసవి నుంచి ఉపశమనం కల్గించినా రైతులకు నష్టం చేకూర్చింది. కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో మాయలూరు బస్టాండు సమీపంలో రెండు భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
తడిచిన పంట దిగుబడులు
నష్టపోయిన రైతులు
నష్టం మిగిల్చిన అకాల వర్షం
నష్టం మిగిల్చిన అకాల వర్షం