
ప్రభుత్వ ఇంటర్ విద్య.. ఇక మిథ్య!
కర్నూలు సిటీ: రాష్ట్ర పెద్దలు ప్రభుత్వ ఇంటర్ విద్యను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయకుండా పరోక్షంగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలకు మేలు చేసేలా సంస్కరణల తీసుకొచ్చారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలో అదనపు సెక్షన్లకు అనుమతులు సైతం ఇచ్చారు. విద్యను సామాజిక సేవగా భావించకుండా కొన్ని ‘కార్పొరేట్’ సంస్థలు వ్యాపారంగా మార్చాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా పనిచేస్తున్న నారాయణకు చెందిన విద్యా సంస్థల ప్రతినిధిని ఇంటర్మీడియట్ బోర్డులో నియమించారు. బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా కార్పొరేట్ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్‌ను మెంబరుగా నియమించలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రభుత్వ ఇంటర్ విద్యను పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే కచ్చితంగా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే హాల్ టికెట్‌పై అడ్మిషన్ ఇవ్వాలని బోర్డు చెప్పింది. అయినప్పటికీ ‘పది’ పరీక్షల ఫలితాలు రాకుండా ఎలా అడ్మిషన్ ఇవ్వాలో అర్థంకాక ఇంత వరకు దరఖాస్తులు ఇచ్చినా అడ్మిషన్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
‘నారాయణ’ పెత్తనం
ఇంటర్మీడియట్ బోర్డు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్లుగా, ఎక్స్ ఆఫిషియో మెంబర్లుగా పది మందిని, యూనివర్సిటీ వీసీలుగా పని చేస్తున్న వారిని నలుగురిని నామినేట్‌గా ఎంపిక చేస్తారు. వీరితో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, కేజీబీవీ, రెసిడెన్షియల్ కాలేజీలకు చెందిన వారిని మెంబర్లుగా నియమించాలి. అయితే ప్రైవేటు కాలేజీలకు చెందిన వ్యక్తిని నియమించాలని ఎక్కడా లేదని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేకపోయినా బోర్డులో ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన ఎ.ఆనంద కిరణ్ అనే నారాయణ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్‌ను నియమించారు. ఆయన సూచనల మేరకే అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేసి, పది పరీక్షల ఫలితాలు రాకముందే అడ్మిషన్ల షెడ్యూల్ జారీ చేశారు.
సర్వత్రా విమర్శలు
ప్రతి ఏటా జూన్‌లో జూనియర్ కాలేజీల తరగతులు పునఃప్రారంభం అయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణల ప్రకారం అంటూ ఈ నెల 1వ తేదీ నుంచే జూనియర్ కాలేజీల తరగతులు పునఃప్రారంభించారు. ఫస్ట్ ఇయర్ తరగతుల అడ్మిషన్ల కోసం ఇచ్చిన షెడ్యుల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పది తరగతి పరీక్షల మూల్యాంకనం ఇటీవలే పూర్తి అయ్యింది. ఫలితాలు రావాలంటే మరో పది, పన్నెండు రోజులు పడుతుంది. అసలు ఫలితాలే రాకుండా జూనియర్ కాలేజీల్లో ఎలా అడ్మిషన్లు ఇస్తారో తెలియక ఇంత వరకు ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రాలేదని తెలుస్తోంది. సంస్కరణల పేరుతో కార్పొరేట్ కాలేజీలు ఏటా ముందస్తూనే అనధికారికంగా అడ్మిషన్లు చేసుకునే వారు. వీటిపై ఏటా విమర్శలు వస్తుండడంతో కూటమి ప్రభుత్వం అధికారికంగా అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తర్వులను
అమలు చేస్తున్నాం
ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించాం. ఫస్ట్ ఇయర్‌కు 7వ తేదీ నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నాం. అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను జారీ చేసి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నాం.
– గురవయ్య శెట్టి, ఆర్‌ఐఓ, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి
ఈ నెల 7 నుంచి 23 తేదీ వరకు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు
ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను
పట్టించుకోని బోర్డు అధికారులు
కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశాలపై
ప్రత్యేక దృష్టి పెట్టిన యాజమాన్యాలు
ఇంటర్ బోర్డులో మెంబర్‌గా
నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జూనియర్ కళాశాలల వివరాలు..
కళాశాల పేరు సంఖ్య
ప్రభుత్వ జూనియర్ 44
ఏపీ మోడల్ 35
కేజీబీవీ 53
ఏపీ రెసిడెన్షియల్ 02
సోషల్ వెల్ఫేర్ 14
జ్యోతిరావు పూలే 04
ఎయిడెడ్ 04
ట్రైబల్ వెల్ఫేర్ 03
వొకేషనల్ 03
హైస్కూల్ ఫ్లస్ 04
ప్రైవేటు 147
మొత్తం 313