
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన అనంత్ తన 30వ పుట్టినరోజును దేశంలోని పవిత్ర నగరాల్లో ఒకటైన ద్వారకలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి కాలినడకన చేరుకోనున్నారు. తమ పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. మేర ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. మార్చి 29న అనంత్ పాదయాత్రను ప్రారంభించారు.
రోజూ 20 కి.మీ. మేర 7 గంటల పాటు నడక సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజుకు ముందు అనంత్ ద్వారకకు చేరుకుని ద్వారకాదీశుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ పాదయాత్రలో పలువురు ఆయనకు సంఘీభావంగా కొంతదూరం పాటు నడిచారు. ఈ సందర్భంగా కొంతమంది ద్వారకాదీశుడి చిత్రాలను అనంత్‌కు బహూకరించారు. అనంత్ పాదయాత్ర పొడవునా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూనే ఉన్నారు.
కుషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన హార్మోన్ల రుగ్మత, స్థూలకాయం, ఉబ్బసం తదితరాలతో బాధపడుతున్నా.. 170 కి. మీ. దూరం నడుస్తుండటం విశేషంగా నిలిచింది. సనాతన భక్తుడైన అనంత్.. బద్రీనాథ్, కేదార్‌నాథ్, కామాఖ్య, నాథ్‌ద్వారా, కాళీ ఘాట్ వంటి ప్రఖ్యాత ఆధ్మాత్మిక క్షేత్రాలను తరచూ సందర్శిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్‌తారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని కూడా అనంత్ అంబానీ నిర్మించడం తెలిసిందే. ప్రధాని మోదీ దాన్ని ఇటీవలే ప్రారంభించారు.
