
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల మొదటి దశ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నేడు(బుధవారం)తో ముగియనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. అదే విధంగా మార్చి 30న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. ఇక.. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎన్నికలు సంఘం మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనుంది. మొదటి దశలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులో ఒకే దశలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాలకు కూడా మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలను మొత్తం 21 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే దశలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ నాలుగో తేదీన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.