
తిరువనంతపురం:కేరళలో మనుషులపై దాడి చేసి చంపుతున్న మ్యాన్ ఈటర్ ఆడపులి మృతిచెందింది. పులి కళేబరాన్ని సోమవారం ఉదయం వయనాడ్‌లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కళేబరం తాము వెతుకున్న మ్యాన్ ఈటర్‌దేనని ధృవీకరించారు. 6నుంచి7 ఏళ్ల వయసు ఉండి ఒంటిపై గాయాలున్న ఆడపులి కళేబరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
గత వారం పులి 45 ఏళ్ల గిరిజన మహిళపై దాడి చేసి చంపిందని కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తెలిపారు. దీంతో దానిని కాల్చి చంపేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఈటర్ పులిని పట్టుకునేందుకు తాము సాగించిన వేట దాని కళేబరం దొరకడంతో ముగిసినట్లు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ తెలిపారు.
పులి ఒంటిపై ఉన్న గాయాలు కొన్ని పాతవి కాగా మరికొన్ని తాజాగా అయినవని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఇతర పులుల దాడిలోనే అది మరణించి ఉండొచ్చని చెప్పారు. తమపై వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయని,వాటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని వయనాడ్‌లో గిరిజనులు ఇటీవల ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.
ఇదీ చదవండి: జగిత్యాలలో పులి సంచారం.. భయాందోళనల్లో ప్రజలు