
అదానీ, వయనాడ్ బాధితులపై మోదీ ద్వంద్వ వైఖరి
ప్రధానిపై రాహుల్‌గాంధీ విమర్శలు
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు.
‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు.
అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు.
బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక
రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే.
రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్‌లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్‌గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు.