
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు.
పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు.