
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు కరోనావైరస్ వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమత్చిన నేపథ్యంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే.. కోవాగ్జిన్‌కు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువత్తాయి. కోవాగ్జిన్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడంపై నిన్న భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో దీనికి ముగింపు పలికేందుకు రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. వివాదానికి శుభం కార్డు వేస్తూ భారత్ బయోటెక్, సీరం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. (చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?)
Important Announcement: Joint statement @BharatBiotech and @SerumInstIndia pic.twitter.com/la5av27Mqy
— SerumInstituteIndia (@SerumInstIndia) January 5, 2021
ప్రపంచానికి కరోనా టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యం అని.. ప్రజలను కాపాడటమే తమ కర్తవ్యం అని రెండు కంపెనీలు తెలిపాయి. ప్రజలను కరోనా నుంచి రక్షించే సత్తా వ్యాక్సిన్లకు ఉంది అని స్పష్టం చేశాయి. తమ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని.. ప్రస్తుతం టీకాల ఉత్పత్తి, పంపిణీపై దృష్టి పెట్టామని భారత్ బయోటెక్, సీరం ఈ ప్రకటనలో తెలిపాయి. వ్యాక్సిన్‌ల పంపిణీ సవ్యంగా జరిగేలా చూస్తామని వెల్లడించాయి. అంతేకాక తమ వ్యాక్సిన్‌లను ప్రపంచం అంతా వినియోగించేలా చూస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్లకు సంబంధించిన వివాదంపై ఇరు కంపెనీలు సంయుక్తంగా వివరణ ఇవ్వబోతున్నాయని ముందురోజు అదార్ పూనావాలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.