
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.
యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్‌ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.
కేజ్రీవాల్‌కు యమునా నది శాపం ఏంటి?
యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్‌లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్‌భవన్ వర్గాలు నిరాకరించాయి.
👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ?