
ముంబై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని(RSS Headquarters) సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంతో.. మోదీ రాజకీయ నిష్క్రమణపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్ మోదీని తప్పించి వారసుడ్ని ఎంపిక చేసే పనిలో ఉందని.. అందుకే ఆయన నాగ్‌పూర్‌కి రావాల్సి వచ్చిందని శివసేన(థాక్రే) నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ‘తండ్రి’ వ్యాఖ్యలతో గట్టి కౌంటరే ఇచ్చారు.
ఈ ఏడాదిలో మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారని.. ఆ విషయాన్ని తెలియజేసేందుకే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారంటూ ముంబైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో రౌత్ అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దరఖాస్తును సమర్పించేందుకే ఆయన ఆరెస్సెస్ నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. గత 10 ఏళ్లలో ఆయన ఏనాడూ అక్కడికి వెళ్లలేదు. కేవలం ఆరెస్సెస్ చీఫ్‌కు వీడ్కోలు చెప్పేందుకే ఇప్పుడు వెళ్లారు అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.

ప్రధానిగా మోదీ సమయం ముగిసిపోయింది. ఈ సెప్టెంబర్‌తో ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆ వయసు, దానిని మించినవాళ్లు పదవుల్లో కొనసాగవద్దని ఆ పార్టీ(BJP)లో అప్రకటిత నిబంధన ఉంది. దేశ నాయకత్వాన్ని మార్చాలని సంఘ్ పరివార్ బలంగా అనుకుంటోందని, బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ త్వరలో మార్పులు ఉండబోతున్నాయని అన్నారాయన. ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal bihari Vajpayee) సందర్శించగా.. మళ్లీ ఇప్పుడు మోదీ ఆరెస్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి చేశారు.
అయితే మోదీ వారసుడిని ఆరెస్సెస్ ఈ సెప్టెంబర్‌లో ఎంపిక చేయబోతుందన్న రౌత్ వ్యాఖ్యలకు బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తండ్రి ఉండగా వారసుడు అనేవాడి అవసరమే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశ నాయకత్వాన్ని మార్చడమా?. మాకు ఆ అవసరమే లేదు. మోదీకి వారసుడిని వెతకాల్సిన అవసరమూ లేదు. మోదీజీనే మా నేత. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం. 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని చర్చించడం కూడా తగదు.
బీజేపీలో వయసు దాటితే రిటైర్‌మెంట్‌లాంటి నిబంధనేదీ బీజేపీలో లేదన్న ఫడ్నవిస్.. 80 ఏళ్ల వయసులో మంతత్రి పదవి చేపట్టిన బీహార్ నేత జితన్ రామ్ మాంజీ పేరును ప్రస్తావించారు. ఈ టర్మ్‌లోనే కాదు.. వచ్చే టర్మ్‌లోనూ ఆయన మా నాయకుడు. మోదీ రాజకీయాలను వీడతారని వ్యాఖ్యానించేవాళ్లది మొఘలుల ఆలోచన ధోరణిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మన సంప్రదాయంలో తండడ్రి బతికి ఉండగా.. వారసత్వం అనే ప్రస్తావనే ఉండదు. ఇలాంటివి మొఘలుల సంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి. వన్ షాట్.. టూ బర్డ్స్‌లాగా ఔరంగజేబ్ సమాధి వివాదం నడుస్తున్న వేళ.. ఫడ్నవిస్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే కిందటి ఏడాది స్వార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ రాజకీయ రిటైర్‌మెంట్ గురించి చర్చ నడిచింది. ఆ టైంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోదీ స్థానంలో అమిత్ షా ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.