E Shinde: ముమ్మాటికీ పొలిటికల్‌ సుపారీనే! | E Shinde First Reaction On Kunal Kamra Episode Says This | Sakshi
Sakshi News home page

E Shinde: డబ్బులిచ్చి మరీ తిట్టించారు.. ఇది పొలిటికల్‌ సుపారీనే!

Published Tue, Mar 25 2025 12:10 PM | Last Updated on Tue, Mar 25 2025 12:54 PM

E Shinde First Reaction On Kunal Kamra Episode Says This

ముంబై: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. కునాల్‌ ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగానే చేసినట్లు తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని అన్నారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకు దిగారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు స్టాండప్‌ కమెడియన్‌ కునాల్. ఈ నేపథ్యంలో  ఆ షో జరిగిన హబిటాట్‌ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే అది ఎవరైనా సరే విధ్వంసానికి తన మద్దతు ఎప్పుడూ ఉండబోదని ఏక్‌నాథ్ షిండే అన్నారు. బీబీసీ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కునాల్‌ ఎపిసోడ్‌పై స్పందించారు.

ప్రజాస్వా​మ్యంలో వాక్‌ స్వాతంత్రం అందరికీ ఉంటుంది. దీనిని కాదనలేం. నా సంగతి పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, భారత మాజీ న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌,  హోం మంత్రి అమిత్‌ షా..వీళ్ల గురించే కాదు ప్రముఖ వ్యాపారులు, గొప్ప గొప్పవాళ్ల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడతను. ఇలాంటి వ్యాఖ్యల కోసం అతనికి ఎవరి నుంచి సుపారీ అందింది?. ఇది కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రే అని అన్నారాయన. ఈ వ్యవహారంలో ప్రజలు కూడా ప్రతిపక్షాలనే వేలెత్తి చూపిస్తున్నారని.. అయినా వాళ్ల విధానాలు మారడం లేదన్నారు.  

ఇక హబిటాట్‌ స్టూడియోపై జరిగిన దాడిని ఖండించిన షిండే.. అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఏక్‌నాథ్‌ షిండే అనేది చాలా సున్నితమైన అంశం. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ, నేను నా పనితోనే వాటికి బదులిస్తుంటా. విధ్వంసానికి నేను వ్యతిరేకం. కానీ, పార్టీ కార్యకర్తలు ఊరుకోలేరు కదా. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement