అస్సలు పశ్చాత్తాప పడను.. షిండేపై వ్యాఖ్యల కేసులో కునాల్‌ కమ్రా | Comments on Eknath Shinde Row: Kunal Kamra First Reaction After Case | Sakshi

అస్సలు పశ్చాత్తాప పడను.. షిండేపై వ్యాఖ్యల కేసులో కునాల్‌ కమ్రా

Mar 24 2025 4:03 PM | Updated on Mar 24 2025 4:52 PM

Comments on Eknath Shinde Row: Kunal Kamra First Reaction After Case

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల దుమారం తర్వాత ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా(kunal kamra) తొలిసారి స్పందించారు. షిండేపై వ్యాఖ్యలను సమర్థించుకున్న కునాల్‌, ఈ వ్యహారంలో తాను క్షమాపణలు చెప్పాల్సి వస్తే.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కమ్రాను ముంబై పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. 

అయితే.. షిండేపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ పశ్చాత్తాపం చెందడం లేదన్న కునాల్‌ కమ్రా.. తన వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. షిండే రాజకీయ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి తనతో ఇలా మాట్లాడించారన్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ముంబై పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే తన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు పోలీసులకు ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

ఇక.. కునాల్‌ కమ్రా తక్షణమే షిండేకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ చేసిన హెచ్చరికలపైనా కమ్రా స్పందించారు. తాను కేవలం న్యాయస్థానాలు కోరినప్పుడు మాత్రమే క్షమాపణలు చెబుతానని ముంబై పోలీసులకు తేల్చి చెప్పాడట. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఈ వివరాలతో  కథనం ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా వ్యాఖ్యలతో ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ క్లబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అందులో అక్రమ కట్టడాలు ఉంటున్నాయంటూ బీఎంసీ (బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌) ఉద్యోగులు ఖార్‌ వద్దకు  చేరుకొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నైక్‌ మాట్లాడుతూ ఖార్‌లోని ఆ స్టూడియో అక్రమ నిర్మాణమని.. చర్యలు తీసుకోవాలని ముంబయి కమిషనర్‌ను కోరినట్లు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ నిర్ణయం కాదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. 

తాజా పరిణామాలపై అసిస్టెంట్‌ కమిషనర్‌ వినాయక్‌ విస్పుటే మాట్లాడుతూ ‘‘స్టూడియో యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారు. వాటిని ఇప్పుడు మేము తొలగిస్తున్నాం. వీటికి నోటీసులతో పనిలేదు’’ అని వెల్లడించారు. అసలు స్టూడియో ప్లాన్‌ను కూడా పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.

ఇటీవల హబిటాట్‌ స్టూడియో(Habitat Club)లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై కునాల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కునాల్‌పై భగ్గుమంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తేల్చిచెప్పారు. ఇంకోవైపు.. థాక్రే శివసేన సహా పలు రాజకీయ పార్టీలు కునాల్‌కు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement