
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్ రుతురాజ్, ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమే రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి అవకాశం వచ్చిన మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు.
గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న విజయ్ శంకర్ కూడా ఫెయిలయ్యాడు. జడేజా, ధోని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ బ్యాటింగ్ విభాగాన్ని బలపరచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిచింది. దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సీఎస్‌కే గత సీజన్‌లో కూడా ట్రయల్స్‌కు పిలిచింది. అతని పెర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేదు.
మాత్రే గతేడాది జరిగిన U19 ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. 44 సగటున, 135.38 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం స్టైలిష్ బ్యాటర్ అయిన మాత్రే.. గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. 65.43 సగటున, 135.50 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు.
మాత్రేను ట్రయల్స్‌కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్‌కే యాజమాన్యం అవసరమైతేనే (ఎవరైనా గాయపడితే) అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరినీ జట్టులో చేర్చుకోబోమని స్పష్టం చేసింది.
కాగా, తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి, ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్‌కే తమ నాలుగో మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం (3:30) ఆడుతుంది.
బెంచ్ కూడా బలహీనమే
ఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పిస్తే ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎంపిక చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు.
బౌలర్లలో నూర్ అహ్మద్ ఒక్కడే రాణిస్తున్నాడు. పతిరణ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్ తేలిపోయారు. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర ఒక్కడే రాణిస్తున్నాడు. డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది.
సీఎస్‌కే పూర్తి జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్‌కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి