
అప్పుడే విదేశీ జట్లకు దీటుగా పోటీనివ్వగలం
భారత మహిళల హాకీ రైజింగ్ స్టార్ సాక్షి రాణా వ్యాఖ్య
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్‌లోనే అనూహ్య గోల్‌తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్‌తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్‌తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది.
ఆ మ్యాచ్‌లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్‌లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.
తొలి మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్‌లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్‌గా మలిచింది.
‘తొలి మ్యాచ్‌లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది.
‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్‌గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.
దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్‌లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్‌లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.