
సింగిల్స్‌లో కళ తప్పుతున్న భారత బ్యాడ్మింటన్
అందనంత దూరంలో ఆశాకిరణాలు
అలసత్వంతో వెటరన్ ప్లేయర్లు
సాక్షి క్రీడా విభాగం : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే దిగ్గజం. తదనంతరం ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వీళ్లిద్దరు పురుషుల కేటగిరీలో లెజెండ్స్! కానీ అమ్మాయిల విభాగంలో మాత్రం స్టార్లు, విజేతలంటూ ఎవరూ లేరు. మళ్లీ గోపీచంద్ తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచి్చన ‘ఆట’కు తిరిగివ్వాలనే లక్ష్యంతో కోచ్‌గా మారాక భారత బ్యాడ్మింటన్ ‘కోర్టు’లో రాణులు వెలుగులోకి వచ్చారు. అతను సానబెట్టిన సైనా నెహ్వల్ ఓ వెలుగు వెలిగింది.
ఎన్నో ఏళ్లుగా మహిళల సింగిల్స్‌లో ఉనికి లేని భారత్‌కు ఘనవిజయాలు, ఒలింపిక్ పతకం తెచ్చి పెట్టింది. ఆమె ఆడుతుండగానే పీవీ సింధు దూసుకొచ్చింది. సింధుది గోపీచంద్ స్కూలే (కోచింగ్). ఆమె అచిరకాలంలోనే సైనాను మరిపించింది. బ్యాడ్మింటన్‌లో మురిపించింది. దేశాన్ని గర్వపడేలా చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం ఇలా ఒకటేమిటి అన్నింటా సింధు మార్కు కనబడింది. అయితే కొంతకాలంగా సింధు ఆటతీరు గాడి తప్పింది.

గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత రెండు సీజన్లు సింధుకు కలిసి రాలేదు. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. కానీ తర్వాతే భారత బ్యాడ్మింటన్‌లో సింధు వారసురాలు కనబడటం లేదు. దీంతో సమీప భవిష్యత్తులో మహిళల సింగిల్స్‌లో ఆశాకిరణం ఫలానా అనే వారు లేక ప్రభ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ ప్రమాద ఘంటికలు 2025 సీజన్ ప్రారంభంలోనే మోగాయి. ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ (కింగ్‌డావో–చైనా)లో చివరి నిమిషంలో గాయంతో సింధు వైదొలగగా... బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది.
పురుషుల, మహిళల సింగిల్స్‌లలో నిలకడలేని ప్రదర్శనతో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. ఒక్క పురుషుల డబుల్స్‌లోనే ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ షెట్టితో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడు. వీలైతే విజయం (పతకం) లేదంటే రన్నరప్... ఇదీ కుదరకపోతే కనీసం సెమీఫైనల్ వరకైనా భారత ఆశల పల్లకిని
మోసుకెళ్తున్నాడు.
ఎంతో ఎత్తుకు ఎదిగినట్లే ఎదిగి...
క్రికెట్ మతమైన భారత్‌లో, ఘనచరిత్ర కలిగిన హాకీ, పతకాలపై గురి పెట్టే షూటింగ్‌లతో పాటు బ్యాడ్మింటన్ కూడా పతకాలు తెచ్చే ప్రముఖ క్రీడాంశమైంది. 2012 నుంచి భారత షట్లర్లు వరుసగా మూడు ఒలింపిక్ పతకాలు సాధించారు. లండన్ (2012)లో సైనా... ‘రియో’లో (2016)... ‘టోక్యో’లో (2020) సింధు పతకాలు పట్టుకొచ్చారు. దీంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్యాలకు లెక్కేలేదు. ఒలింపిక్ నుంచి ఒలింపిక్ కాలచక్రంలో మిన్నంటే ప్రదర్శనతో షట్లర్లు వెలుగులీనారు.
కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇలా వచ్చిన వారే. పతకం తేలేకపోయినా పురుషుల్లో లక్ష్య సేన్, మహిళల్లో సింధు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కానీ తదుపరి ఒలింపిక్స్‌లో ఈ అర్హత ముచ్చట కూడా దక్కేలా కనబడటం లేదు. ఎందుకంటే శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో పదును తగ్గింది. మ్యాచ్‌లు గెలిచే సత్తా కరువైంది. మహిళల సింగిల్స్‌లో సింధుకు ఇటు ఆటతీరులో నిలకడ లేదు! అటు ఫిట్‌నెస్‌లో స్థిరత్వం లేదు. దీంతో కొత్త ఒలింపిక్ సైకిల్‌లో వీళ్లెవరూ ముందుకెళ్లే షట్లర్లు కానేకారని స్పష్టంగా అర్థమవుతోంది.
ఏమిటీ పరిస్థితి... ఎందుకీ దుస్థితి!
శ్రీకాంత్, ప్రణయ్‌లు వెటరన్ ప్లేయర్లు కావడంతో సహజంగా వయసు పైబడిన ఛాయలు వారిని వెనక్కి లాగుతున్నాయి. కానీ లక్ష్యసేన్ తన కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాలతో ఔరా అనిపించాడు. కానీ కొన్నాళ్లుగా అలసత్వమో... అనాసక్తినో తెలియదు కానీ ఆశించిన స్థాయి ఆటతీరే కనబరచడం లేదు. ఇది భారత పతకాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో సింధు ఎన్నో సాధించింది. దేశానికి ఎంతో పేరు తెచ్చింది.
కానీ ఆమె తర్వాత కోర్ గ్రూపులో ఉండే కొదమ సింహాలను మాత్రం భారత బ్యాడ్మింటన్ రంగం తయారు చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే డబుల్స్ ప్రాధాన్యం వల్ల సింగిల్స్ స్టార్లు కరువైనట్లు ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. పురుషుల డబుల్స్‌లో పదో ర్యాంక్‌తో సాత్విక్–చిరాగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌తో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ టాప్–10లో ఉన్నాయి.
కానీ సింగిల్స్‌లో సింధు (17), మాళవిక బన్సోద్ (23), అనుపమ ఉపాధ్యాయ్ (44), రక్షిత శ్రీ (45), ఆకర్షి కశ్యప్ (48), ఉన్నతి హుడా (55), తస్నిమ్ మీర్ (63), అన్‌మోల్ ఖరబ్ (67)... లక్ష్య సేన్ (18), ప్రణయ్ (29), కిరణ్ జార్జి (36), ప్రియాన్షు రజావత్ (38), ఆయుశ్ శెట్టి (44), సతీశ్ కుమార్ కరుణాకరన్ (47), తరుణ్ మన్నేపల్లి (53), కిడాంబి శ్రీకాంత్ (54), శంకర్ ముత్తుస్వామి (59)ల ర్యాంక్‌లు సమీప భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్‌కు ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతున్నాయి.
నంబర్‌వన్ ర్యాంక్ దేవుడెరుగు... అసలు టాప్–10లో నిలువగలిగే ప్లేయరే కనిపించడం లేదు. కానీ... కాంపిటీటివ్ బెంచ్ (పోటీల్లో సత్తాచాటే బెంచ్)ను ముందుచూపుతో తయారు చేయడంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్లక్ష్యం కనబడుతోంది.
కిం కర్తవ్యం?
తదుపరి లాస్ ఎంజెలిస్ (2028) ఒలింపిక్స్ సైకిల్ మొదలైంది. తాజా పరిణామాలు, నిరాశాజనక ప్రదర్శనలు, వస్తోన్న ఫలితాలపై ‘బాయ్’ వెంటనే దృష్టి పెట్టాలి. అంటే విశ్వక్రీడలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. ఈ లోపు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ తదితర ఈవెంట్లెన్నో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ‘బాయ్’ గానీ, ‘సాయ్’గానీ ఇప్పుడే మేల్కొవాలి. ఒలింపిక్స్ మిషన్‌కు ఓ విజన్‌తో పని చేయాలి.
బాగా ఆడే షట్లర్లు ఎందుకిలా అయ్యారో సమీక్షించాలి. వర్ధమాన షట్లర్లను గుర్తించి ఆర్థిక అండదండలు అందించాలి. కేంద్ర క్రీడా శాఖ ‘టాప్స్’లా ‘బాయ్’ కూడా సానుకూల దృక్పథంతో తమ ప్లేయర్లకు ఇంటా బయటా కోచింగ్‌కు, కోచ్‌లకు పెద్ద ఎత్తున వెచ్చించాలి. ఓ క్రమపద్ధతిలో లక్ష్యాలను పెట్టుకొని ఫలితాల కోసం కష్టపడితే పరిస్థితిలో మార్పు రావొచ్చు.