
క్రీడల్లో రాణించాలంటే తల్లిదండ్రుల మద్దతు కీలకం
కుటుంబం వెన్నంటే ఉంటే ఏదైనా సాధ్యమే
భారత హాకీ స్టార్ వందన కటారియా మనోగతం
న్యూఢిల్లీ: ఏ ఆటలోనైనా... ఏ స్థాయి ప్లేయర్‌కైనా... అంతిమ లక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే... అయితే అందరికీ ఒలింపిక్ పతకాన్ని అందుకునే భాగ్యం ఉండదు. ఎంత సత్తా ఉన్నా... జట్టు క్రీడలో సమన్వయం కొరవడితే ఫలితాలు తారుమారు అవుతాయి... లక్ష్యానికి చేరువై దూరమైపోతారు. భారత సీనియర్ హాకీ స్టార్ వందన కటారియా కెరీర్‌లోనూ ఇలాగే జరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వందన సభ్యురాలిగా ఉన్న భారత జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. బ్రిటన్ జట్టుతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ కీలక మ్యాచ్‌లో వందన ఒక గోల్ కూడా చేసింది.
అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వందన ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. మంగళవారం అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పిన వందన తన కెరీర్‌లో ఒలింపిక్ పతకం లేకపోవడం లోటుగా ఉండిపోతుందని, టోక్యోలో కాంస్యం సాధించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. ‘నేను హరిద్వార్‌లో హాకీ స్టిక్ పట్టుకునే సమయానికి ఆడపిల్లలు ఇంటి గడప దాటకూడదనే అభిప్రాయం ఉండేది. వందనను హాకీ ఆడేందుకు ఇంటి బయటకు ఎందుకు పంపిస్తున్నావని మా నాన్నను ఇంటి చుట్టుపక్కల వాళ్లు చాలాసార్లు ప్రశ్నించారు.
కానీ వారి మాటలను ఆయన పట్టించుకోలేదు. నాకంటే ముందుగానే మా ఇద్దరు అక్కలు రీనా, అంజలి హాకీ ఆడేవారు. నేను ఖోఖోను ఎక్కువ ఇష్టపడేదాన్ని. కొన్ని రోజులు గడిచాక నేను కూడా హాకీవైపు మళ్లాను. మాకెంతో మద్దతు ఇచ్చిన నాన్న టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. నాన్న మరణం నన్ను కుంగదీసినా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో టోక్యోకు వెళ్లాను. కుటుంబసభ్యుల మద్దతు ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించడం సాధ్యమే’ అని 32 ఏళ్ల వందన తెలిపింది.
‘అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదు. చాలా మంది జూనియర్ ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వందన వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించలేదని... అయితే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన హాకీకి తప్పకుండా సేవలు అందిస్తానని వందన తెలిపింది.