
భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రీడాకారిణిగా ఘనత
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది.
‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్‌పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్‌బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది.
2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.