
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కూడా డివిలియర్స్, బ్రెండన్ మెకల్లమ్‌లాంటి అనేక మంది స్టార్లు ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌లు ఆడుతున్నారు. అయితే తనకు మాత్రం అలాంటి ఆలోచనలేమీ లేవని భారత కెప్టెన్ కోహ్లి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా టి20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడేందుకు ఒకవేళ బీసీసీఐ భారత క్రికెటర్లకు కూడా అవకాశం ఇస్తే, అప్పటికి రిటైరైతే ఆ టోర్నీలో ఆడతావా అనే ప్రశ్నకు కోహ్లి సమాధానమిచ్చాడు. తనలో పూర్తిగా సత్తువ అయిపోయిందని భావించిన రోజునే రిటైర్మెంట్ ప్రకటిస్తానని, ఆ తర్వాత బ్యాట్ ముట్టుకోనని అతను అన్నాడు. ‘భవిష్యత్తులో బీసీసీఐ నిర్ణయం మారుతుందా లేదా తెలీదు. నాకు సంబంధించి మాత్రం ఒక్కసారి ఆట ముగిశాక ఇంకా క్రికెట్ ఆడలేనని నిజాయితీగా చెబుతున్నా. గత ఐదేళ్లలో నేను చాలా ఎక్కువ క్రికెట్ ఆడాను. రిటైర్ కాగానే నేనేం చేస్తానో చెప్పలేను కానీ మళ్లీ బ్యాట్ మాత్రం పట్టుకోను. నేను ఒకసారి క్రికెట్ ఆడటం మానేస్తున్నానంటే ఆ సమయానికి నాలో శక్తి సామర్థ్యాలు పూర్తిగా కరిగిపోయాయనే అర్థం. కాబట్టి మళ్లీ వచ్చి ఆడే ప్రసక్తే లేదు. ఒక్కసారి క్రికెట్ ముగిసిందంటే దరిదాపుల్లో కూడా కనిపించను’అని కోహ్లి స్పష్టం చేశాడు.
కోహ్లి, శాస్త్రిలకు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం
క్రికెట్‌కు చేసిన సేవలకు గాను భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) జీవిత కాల గౌరవ సభ్యత్వం అందుకున్నారు. బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ హోదా అందుకున్న ఇతర దేశాలవారు వీరిద్దరే కావడం విశేషం. ‘ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాను ఎస్‌సీజీ అభినందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ దేశమైన భారత్ టెస్టులపై ఆధిపత్యం చెలాయిస్తున్న తీరును చూడటం అద్భుతం. టెస్టు క్రికెట్ ఔన్నత్యాన్ని ఇది కాపాడుతుంది’ అని ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెపర్డ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ‘కోహ్లితో కలిసి ఇంతటి గౌరవం పొందినందుకు ధన్యుడిని’ అని రవిశాస్త్రి ట్విట్టర్‌లో సందేశం ఉంచాడు.