SLBC Tunnel: 24 గంటల్లో బయటికి! | SLBC tunnel rescue teams stepped up rescue operations | Sakshi
Sakshi News home page

SLBC Tunnel: 24 గంటల్లో బయటికి!

Published Sun, Mar 2 2025 3:02 AM | Last Updated on Sun, Mar 2 2025 10:31 AM

SLBC tunnel rescue teams stepped up rescue operations
  • ఒకచోట నలుగురు, మరోచోట నలుగురు ఉన్నట్టు ఆనవాళ్లు 
  • ఆదివారం సాయంత్రానికి నలుగురిని వెలికితీసే అవకాశం 
  • మిగతా వారి కోసం మరో రెండు రోజులు పట్టవచ్చంటున్న నిపుణులు 
  • సుమారు 18 అడుగుల మేర ఉన్న మట్టి, శిథిలాల తొలగించేందుకే ఆలస్యం 
  • మట్టి, బురదను తొలగించిన కొద్దీ ఉబికివస్తున్న ఊట నీరు 
  • సహాయక చర్యల్లో వేగం పెంచిన రెస్క్యూ బృందాలు 
  • పరిస్థితిని సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల్లో నలుగురిని ఆదివారం బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఒకచోట నలుగురు, మరోచోట నలుగురు కార్మికుల ఆనవాళ్లను గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌ ) గుర్తించింది. సొరంగం పైకప్పు కూలిపడిన సుమారు 150 మీటర్ల స్థలంలో ముందు భాగంలో నలుగురు, చివరి భాగం (ఎండ్‌ పాయింట్‌)లో నలుగురు ఉన్నట్టుగా ‘నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)’ నిపుణులు అంచనా వేశారు. 

ముందు భాగంలో ఉన్న నలుగురిని బయటికి తీసేందుకు సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందాలతో మ్యాన్యువల్‌గా తవ్వకాలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే వీరిని వెలికితీసే అవకాశం ఉందని తెలిసింది. ఇక చివరి భాగంలో ఉన్న నలుగురు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) హెడ్‌కు సుమారు 15 మీటర్ల వెనకాల చిక్కుకొని ఉన్నట్టుగా భావిస్తున్నారు. అక్కడ సుమారు 18 అడుగుల ఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుని ఉండటంతో.. అక్కడున్న నలుగురిని బయటికి తీసేందుకు ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 

బురద, ఊట నీటితో ఆటంకం.. 
సొరంగం పైకప్పు కూలిన ప్రాంతంలో సుమారు 18 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు మట్టి, బురద, శిథిలాలు పేరుకుని ఉన్నాయి. అందులో కాంక్రీట్‌ సెగ్మెంట్లు, టీబీఎం భాగాలు, రాళ్లు, మట్టి కాకుండా అసాధారణ అవశేషాలు ఉన్న స్పాట్లను జీపీఆర్‌ గుర్తించింది. ఆయా చోట్ల మ్యాన్యువల్‌గా తవ్వకాలు చేపట్టగా.. తవి్వన కొద్దీ ఏర్పడుతున్న బురద, ఊట నీటితో ఇబ్బంది ఎదురవుతోంది. సొరంగంలో నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల సీపేజీ వస్తుండటంతో పది పంపులతో డీవాటరింగ్‌ పనులు చేపడుతున్నారు. హైడ్రాకు చెందిన మినీ డోజర్‌తో బురదను తొలగిస్తున్నారు. 

కన్వేయర్‌ బెల్టు మరమ్మతుకు మరో 2 రోజులు: సొరంగంలో 13 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్‌ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి మినీ డోజర్‌ ద్వారా బురద, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందు 200 మీటర్ల వరకు చేరుకునేందుకు రెస్క్యూ సిబ్బంది సిద్ధం చేసిన ఫ్లోటింగ్‌ బెల్టు మీదుగా నడిచి వెళుతున్నారు. 

ఈ శిథిలాలు, మట్టి తొలగించేందుకు కన్వేయర్‌ బెల్టు అందుబాటులోకి రాక ఆలస్యం అవుతోంది. కన్వేయర్‌ బెల్టు ఎండ్‌ పార్ట్‌ వద్ద మెషీన్‌ పూర్తిగా ధ్వంసం కావడం, బెల్టును తిరిగి వినియోగంలోకి తేవాలంటే కొత్త ఫౌండేషన్‌ వేయాల్సి ఉండటంతో.. ఇందుకోసం మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. 
సహాయక చర్యల్లో ఆధునిక సాంకేతికతను, పరికరాలను వినియోగిస్తున్నారు. శిథిలాల్లో అవశేషాలను గుర్తించేందుకు గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌), మానవ రక్తం ఆనవాళ్లను గుర్తించే ఆక్వా–ఐ, ప్రోబోస్కోప్, టీబీఎం విడిభాగాలు, శిథిలాలను కట్‌ చేసేందుకు అల్ట్రా థర్మికల్‌ కటింగ్‌ మెషీన్, ప్లాస్మా కట్టర్స్, సొరంగంలోని బురద, మట్టిని తొలగించేందుకు ఆర్మీకి చెందిన రెండు మినీ బాబ్‌ క్యాట్‌ మెషీన్లు, ఎస్కవేటర్‌ను వినియోగిస్తున్నారు.

 టన్నెల్‌ లోపల సహాయక చర్యలను ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఐజీ మోహ్సెన్‌ షహది పర్యవేక్షిస్తున్నారు. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, ఎన్‌జీఆర్‌ఐ నిపుణులతో సమీక్షించారు. 

డాక్టర్‌గా చెబుతున్నా.. వాళ్లు బతికుండే అవకాశం లేదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ 
సొరంగంలో కార్మికులు మట్టి, బురద, శిథిలాల కింద కూరుకుపోయారని.. ఒక డాక్టర్‌గా చెబుతున్నానని, వాళ్లు బతికి ఉండేందుకు అవకాశం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్మికులను బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని.. ఒకట్రెండు రోజుల్లో బయటికి తీసే అవకాశం ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 

సర్వే కోసం నేడు ఎన్‌ఆర్‌ఎస్‌సీ బృందం.. 
సొరంగంలో కుప్పకూలిన ప్రాంతానికిపైన భూఉపరితలం వద్ద ‘నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ)’ అధికారులు సర్వే చేపట్టారు. ఈ ప్రాంతానికి సమీపంలో మల్లెల తీర్థం జలపాతం ఉండటం, దానికి నల్లవాగు (ఏనిగే)కు మధ్యలో సుమారు 400 మీటర్ల లోతున టన్నెల్‌లో ప్రమాదం జరగడంతో... టన్నెల్‌లో భారీగా నీటి ఊటకు కారణాలపై పరిశీలన చేపట్టారు. 

అయితే ఎన్జీఆర్‌ఐ పరికరాల ద్వారా 150 మీటర్లలోతు వరకు మాత్రమే మట్టి పొరలు, రాళ్ల ఆకృతుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సొరంగం 400 మీటర్ల లోతులో ఉన్న నేపథ్యంలో... పరిశోధించేందుకు ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)’ చెందిన నిపుణులు ఆదివారం రంగంలోకి దిగనున్నారు. 

వెళ్లి చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టమో తెలుస్తుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు 
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటికి తీసే చర్యల్లో పురోగతి కనిపించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం దోమలపెంట సొరంగం వద్ద మంత్రి ఉత్తమ్‌తో కలసి అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న కార్మికులు బతికి ఉండే అవకాశం  99శాతం లేదన్నారు.

రెస్క్యూ బృందాలు ప్రమాదంలో పడొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్తగా పనులు చేపడుతున్నామని, అందుకే ఆలస్యం అవుతోందని జూపల్లి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు చేస్తున్నవారు ఒకసారి టన్నెల్‌లో ప్రమాదస్థలానికి వెళ్లి చూస్తే.. పరిస్థితి ఎంత కష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement